బయోపిక్ లో ప్రముఖ తారలు..

- July 05, 2018 , by Maagulf
బయోపిక్ లో ప్రముఖ తారలు..

టాలీవుడ్‌కు బయోపిక్‌ (జీవిత చరిత్ర) కథాచిత్రాలు కొత్తేమీ కాదు. కాకపోతే ఇప్పుడు అలాంటి చిత్రాలు సంఖ్యాపరంగా ఒక్కసారి సెట్స్‌పైకి వస్తుండటం ఓ విశేషం. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వై.యస్‌.రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న యాత్ర చిత్రం చిత్రీకరణ మొదలుకాగా.మహానటుడు ఎన్టీఆర్‌ బయోపిక్ ఈరోజు ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఇక బాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ జీవితకథ ఆధారంగా రూపొందబోయే చిత్రం సెప్టెంబర్‌లో మొదలుకానున్నట్లు సమాచారం. ఇలా బయోపిక్‌ చిత్రాల నిర్మాణం వరుస పెట్టడంతో టాలీవుడ్‌లో సందడి సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు ప్రేక్షకలోకంలో కూడా వీటి గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రం విషయానికి వస్తే.తన తండ్రి పాత్రలో బాలకృష్ణ నటించే ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ ప్రత్యేకతను చూపిస్తూ ఈ చిత్రాన్ని తీయబోతున్నారు. దాంతో ఇందులో ఏ పాత్రను ఎవరు పోషించబోతున్నారన్న అంశం అత్యంత ఆసక్తికరంగా మారింది. ముందునుంచి వినిపిస్తున్న ప్రకారం ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రకు బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ ఖరారైందని అంటున్నారు. ఇక నారా చంద్రబాబునాయుడి పాత్రలో రానా, కృష్ణ పాత్రలో కనిపిస్తారని వినిపిస్తోంది. అక్కినేని పాత్రలో నాగచైతన్య లేదా సుమంత్‌ నటించవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటులు మోహన్‌బాబు, డా.రాజశేఖర్‌, ఇంకా శర్వానంద్‌ వంటి పలువురు నటులతో పాటు మహానటిగా ఇటీవల సావిత్రి పాత్రలో మెరిసిన కీర్తిసురేష్‌ కూడా నటించనున్నట్లు పరిశ్రమ వర్గాల భోగట్టా. ఎన్టీఆర్‌ సరసన సావిత్రి ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించారు. దీంతో సావిత్రి పాత్రకు సహజంగానే ఈ చిత్రంలో ప్రాధాన్యం సంతరించుకుంది. సావిత్రిగా కీర్తిసురేష్‌ అయితేనే బావుంటుందని ఆమెను ఎంపిక చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ జోరుగా సాగుతోంది. 
ఇక వై.యస్‌. బయోపిక్‌ ఆధారంగా రూపొందుతున్న యాత్ర చిత్రం సంగతికి వస్తే.వై.యస్‌. పాత్రలో మమ్ముట్టి నటిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహి. వి.రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు.2003లో వై.యస్‌.రాజశేఖర్‌రెడ్డి పేదల కష్టాల్ని స్వయంగా తెలుసుకోవడానికి కడప దాటి వస్తున్నా.మీ గడప కష్టాలు వినటానికి అనే నినాదంతో పాదయాత్ర ప్రారంభించి..60 రోజుల పాటు యాత్రను కొనసాగించారు. ఈ అంశాలన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇందులో రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి పాత్రకు జగపతిబాబును ఎంచుకున్నారని, అలాగే ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని, వై.యస్‌.కుమార్తె షర్మిల పాత్రలో భూమిక నటించనున్నట్లు కొద్దిరోజులుగా వినిపిస్తోంది. ఇక ప్రముఖ బాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌కు కూడా తెరవెనుక సన్నాహాలు జరుగుతున్నాయి. గోపీచంద్‌గా నటుడు సుధీర్‌బాబు నటించనున్నారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించనున్నారు. స్వతహాగా సుధీర్‌బాబు కూడా బాడ్మింటన్‌ క్రీడాకారుడు కావడంతో ఈ చిత్రం చేయాలన్నది ఆయనకు ఓ డ్రీమ్‌లా అనిపించింది. సెప్టెంబర్‌లో ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు ఇటీవల సుధీర్‌బాబు వెల్లడించారు. ఈ చిత్రంలోని కొన్ని ముఖ్య సన్నివేశాలలో పుల్లెల గోపీచంద్‌ను కూడా చూపించబోతున్నారట. ఇంకా ఈ చిత్రంలో నటీనటులుగా ఎవరెవరిని ఎంపిక చేయబోతున్నారన్న అంశంపై స్పష్టత రావాల్సివుంది. కొన్ని పాత్రలకు ప్రముఖులనే తీసుకునే ఆలోచనలో ఉన్నారట. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం ఇటీవల విడుదలై, ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రస్తుతం తీసే బయోపిక్‌లలో కూడా ప్రముఖ తారలను ఎంపిక చేసేందుకు పూనుకోవడం హాట్‌టాపిక్‌ అయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com