భారీ ఊరట: 88 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు
- July 21, 2018
ఢిల్లీ: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన శనివారం భేటీ అయిన జీఎస్టీ మండలి సమావేశంలో సామాన్యులకు, కొందరు వ్యాపారులకు పెద్ద ఊరట ఇచ్చారు. 28వ జీఎస్టీ మండలి సమావేశంలో పలు వస్తువులపై జీఎస్టీ తగ్గించడం, కొన్నింటిపై పూర్తిగా జీఎస్టీ ఎత్తివేశారు.
5 కోట్ల రూపాయల టర్నోవర్ చేసే అధికారులకు ఇది మంచి ఊరట. పలు వస్తువులపై పన్ను శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది. శానిటరీ నాప్కిన్స్స్, మార్బుల్స్, రాఖీలు, చెక్కబొమ్మలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. మొత్తంగా 88 వస్తువులపై పన్ను తగ్గించింది. మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద ఊరట.
నిత్యం ఉపయోగించే 88 వస్తువులపై జీఎస్టీ తగ్గడం గమనార్హం. చాలా వస్తువులను 28% నుంచి 18% శ్లాబులోకి తీసుకు వచ్చారు. మధ్య తరగతికి మేలు చేసేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. సవరించిన పన్నులు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా పన్ను రాయితీల కారణంగా ప్రభుత్వం రూ.8000-10,000 కోట్ల మేర ఆదాయం కోల్పోతుంది.
ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగాల కల్పన, ఆర్థిక ప్రగతిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకున్నట్లు పీయూష్ గోయల్ తెలిపారు. ఏడాదిగా వస్తున్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని శానిటరీ న్యాప్‌కిన్స్‌పై పన్నును పూర్తిగా ఎత్తివేశారు. ఇప్పటి వరకు దీనిపై 12 శాతం ఉంది. చిన్న తరహా హస్తకళలపై కూడా పన్ను రద్దు చేశారు.
రాళ్ల వర్గీకరణలో ఉన్న ఇబ్బందులను తొలగించడం కోసం కోటా స్టోన్స్, శాండ్ స్టోన్, ఇతర స్థానిక రకాల రాళ్లపై పన్నును 18 నుంచి 12 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం రూ.500 ధర ఉన్న పాదరక్షలపై 5 శాతం పన్ను, అంతకుమించిన వాటిపై 18 శాతం పన్ను ఉంది. ఇకపై రూ.1000 ధర వరకు 5 శాతం పన్ను వసూలు చేస్తారు.
మధ్య తరగతి వారు ఎక్కువగా వినియోగించే 17 వస్తువులపై పన్ను 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. ఇందులో టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లు తదితరాలు ఉన్నాయి. పెయింట్లు, వార్నిష్, పుట్టీపై పన్ను తగ్గింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరియాపై పన్నును 5 శాతానికి, అన్ని తోలు వస్తువులపై పన్నును 28 శాతం స్లాబు నుంచి 18 శాతం స్లాబుకు తగ్గించారు. ఈ పుస్తకాలపై పన్ను ఐదు శాతానికి తగ్గించారు. త్వరలో మరోసారి జీఎస్టీ మండలి సమావేశమై చక్కెరపై సెస్ విధింపు, భీమా యాప్, రుపే కార్డు ద్వారా జరిపే చెల్లింపులపై రాయితీలు ఇచ్చే అవకాశముంది.
లిథియం బ్యాటరీలు, వాక్యూమ్ క్లీనర్లు, మిక్సర్ గ్రైండర్లు, వాటర్ హీటర్లు, వాషింగ్ మిషన్లు,హెయిర్ డ్రైయర్లు, కూలర్లు, పాలు, ఐస్ క్రీమ్, ఇస్త్రీ పెట్టెలు, వర్క్ ట్రక్, సుగంధ ద్రవ్యాలు, బాత్రూంలను శుభ్రపరిచే రసాయనాలు, రంగులు, వార్నిష్‌లను 28 శాతం పన్ను పరిధి నుంచి 18 శాతం పన్ను పరిధిలోకి చేర్చారు.
చేతి సంచులు, నగల పెట్టెలు, రాతి శిల్పాలు, అలంకృత అద్దాలు, చేతితో తయారు చేసిన విద్యుత్ దీపాలను 12 శాతం స్లాబులోకి తెచ్చారు. దిగుమతి చేసుకునే యూరియాపై పన్నును 5 శాతానికి తగ్గించారు. రూ.5 కోట్ల టర్నోవర్ చేసే వ్యాపారస్తులు ప్రతి నెలా కాకుండా మూడు నెలలకోసారి త్రైమాసిక జీఎస్టీ రిటర్న్స్‌ను సమర్పించే వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







