11న పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం:మోడీకి ఆహ్వానం!

- July 31, 2018 , by Maagulf
11న పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం:మోడీకి ఆహ్వానం!

లాహోర్: పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఆగస్టు 11న ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు ఇప్పటికే పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఇప్పుడొక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా సార్క్ దేశాధినేతలను ఆహ్వానించాలని పీటీఐ నిర్ణయించినట్లు సమాచారం.
'ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా సార్క్(ఆఫ్ఘనిస్థాన్, నేపాల్, భూటాన్, భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక) దేశాధినేతలను ఆహ్వానించాలని పీటీఐ కోర్ కమిటీ భావిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం' అని పీటీఐ నేత ఒకరు మీడియాకు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇమ్రాన్ ఖాన్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సార్క్‌లో పాకిస్థాన్‌కూడా సభ్య దేశమే.
కాగా, పాక్ ఎన్నికల్లో విజయం సాధించిన ఇమ్రాన్ ఖాన్‌కు ప్రధాని మోడీ సోమవారం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 'పాకిస్థాన్, భారత్ ద్వైపాక్షిక బంధంలో కొత్త అధ్యయాన్ని ప్రారంభించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం' అని మోడీ.. ఇమ్రాన్‌తో అన్నారు. ఇందుకు ఇమ్రాన్.. మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఇది ఇలావుంటే, 2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి అప్పటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ హాజరయ్యారు. ఆ తర్వాత 2015 డిసెంబరులో నవాజ్‌షరీఫ్‌ పుట్టినరోజు సందర్భంగా విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని లాహోర్‌లో ఆగి షరీఫ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని అంతా భావించారు.
కానీ, పాకిస్థాన్ మాత్రం కుక్క తోక వంకరే అన్నట్లు సరిహద్దులో తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులకు పాల్పడింది. దీంతో భారత్ కూడా అదే స్థాయిలో దాడులను తిప్పికొట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com