అమెరికా లో ఇండియన్ స్టూడెంట్స్ కి కష్టకాలం

- August 11, 2018 , by Maagulf
అమెరికా లో ఇండియన్ స్టూడెంట్స్ కి కష్టకాలం

అమెరికా:అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు గడ్డు రోజులు సమీపిస్తున్నాయి. గడువు మీరిన తరువాత కూడా చట్ట వ్యతిరేకంగా అమెరికాలోనే తిష్టేసే విద్యార్థులు మళ్లీ అడుగు పెట్టకుండా కొత్త నిబంధనలు రూపుదాల్చాయి. ఆ నిబంధనలు కూడా ఈ నెల 9 నుంచే అమల్లోకి రావడంతో విద్యార్థి లోకం, ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. చైనా తరువాత పెద్ద సంఖ్యలో భారతీయులే అమెరికాకు చదువు కోసం వెళ్తున్నారు. ఒకవేళ వీసా గడువు ఉన్నప్పటికీ స్టూడెంట్ స్టేటస్ ముగిసినవారు కూడా అమెరికాలో ఉండడానికి వీల్లేదు. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తరువాత ఒక్క క్షణం అమెరికాలో ఉన్నా వేటు పడడం ఖాయంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా అధికారుల కళ్లుగప్పి ఉంటున్నవారికి 180 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ లోగానే వారు బిచాణా ఎత్తేయాలి. ఆ తరువాత కూడా ఇంకా అమెరికాలోనే ఉన్నట్టయితే 3 నుంచి 10 ఏళ్ల వరకు అమెరికాలో అడుగు పెట్టకుండా వేటు పడుతుంది. అలాగే అనధికారికంగా జాబ్స్ చేస్తున్నవారినీ తాజా రూల్స్ వదల్లేదు. విద్యాసంస్థల్లో విద్యార్థుల కనీసపు గంటల హాజరును తప్పనిసరి చేస్తున్నారు.

దీంతో హాజరు గంటలకు డుమ్మా కొట్టి ప్రైవేట్ జాబ్స్ చేసుకునేవారి మీద కూడా వేటు పడుతుందన్నమాట. ఇంతకుముందు ఈ నిబంధనలు.. విద్యార్థి ఉల్లంఘించినట్టు తేలాక గానీ లేదా ఇమ్మిగ్రేషన్ అధికారి ఆదేశం తరువాత గానీ అమల్లోకి వచ్చేవి. అయితే కఠినతరమైన నిబంధనలు ఉన్నపళంగా కాకుండా ముందే హెచ్చరికలు జారీ చేసి కాస్త నిదానంగా తీసుకొచ్చినట్టయితే విద్యార్థులు అలర్టయ్యేవారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూల్స్ ను మరోసారి సమీక్షించాలన్న వినతులు వెల్లువెత్తుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com