సౌదీ అరేబియా:భారతీయులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు

- August 17, 2018 , by Maagulf
సౌదీ అరేబియా:భారతీయులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు

రియాద్‌:తమ దేశంలో భారతీయులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సౌదీ రాయబారి బిన్‌ మొహ్మద్‌ అల్‌సటీ శుక్రవారం వెల్లడించారు. హాస్పిటాలిటీ, టూరిజం, ఐటీ రంగాల్లో పనిచేసేందుకు నైపుణ్యమున్న భారతీయులకు అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పశ్చిమ ఆసియాలో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయని వస్తున్న వార్తలు అవాస్తవమైనవని ఖండించారు. 
ఖిద్దియా ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీ, నియోమ్‌ ఎకనామిక్‌ జోన్‌ వంటి ప్రతిష్టాత్మకమైన మెగా ప్రాజెక్టులను 2030లోపు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఈనేపథ్యంలో నైపుణ్యమున్న భారతీయులుకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని అన్నారు. అంతేగాకుండా, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని యువరాజు మొహ్మద్‌బిన్‌ సుల్తాన్‌ ఆదేశించారని బిన్‌ మొహ్మద్‌ తెలిపారు. టాటా, రిలయన్స్‌, ఎల్‌ అండ్‌ టీ, ఇన్ఫోసిస్‌, షపూర్జీ పలోన్జీ వంటి సంస్థలు సౌదీలోనూ విస్తృత కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని అన్నారు. దాదాపు 400 కంపెనీల నిర్వహణకు లైసెన్సులు మంజూరు చేసినట్టు సౌదీ అరేబియా జనరల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ వెల్లడించింది. 
మక్కా నుంచి మదీనా వరకు 450కిలోమీటర్ల దూరంలో రైల్వే లైన్‌ నిర్మాణం కోసం, జెడ్డాలో విమానాశ్రయం నిర్మాణం పనులు త్వరలో చేపడతామని అన్నారు. సౌదీ అరేబియాలో 32 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారని, 2016-17లో ఇరుదేశాల మధ్య 25బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగిందని అల్‌సటీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com