కేరళకు సినీనటుల విరాళాలు..

- August 19, 2018 , by Maagulf
కేరళకు సినీనటుల విరాళాలు..

సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నా.. ఇంకా వేలాదిమందికి సాయం అందని పరిస్థితి. ఈ నేపథ్యంలో జలవిలయంతో తల్లడిల్లుతున్న కేరళను ఆదుకునేందుకు యావత్‌ దేశం ముందుకు వస్తోంది.

వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 25 కోట్లను హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి… కేరళ సీఎం సీఎం విజయన్‌కు అందజేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు కూడా వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. నెల వేతనం విరాళంగా ఇవ్వాలని 20 మంది ఎంపీలు నిర్ణయించారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా తనకు వచ్చే నెల జీతాన్ని సాయంగా ప్రకటించారు.

వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళను ఆదుకునేందుకు పశ్చిమబెంగాల్ ముందుకొచ్చింది. వరద బాధితులకు తమవంతు సాయంగా సీఎం మమతా బెనర్జీ పది కోట్ల రూపాయలు ప్రకటించారు. ఇక.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కేరళ వరద సాయాన్ని రెట్టింపు చేశారు. గతంలో ఐదు కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సీఎం.. మరో ఐదు కోట్ల రూపాయలు అందిస్తున్నట్టు తెలిపారు. వీటితో పాటు 8 కోట్ల విలువచేసే పాలిథీన్ షీట్స్ పంపించారు. అలాగే 244 మంది అగ్నమాపక దళ సిబ్బందిని, 75 బోట్లను ప్రత్యేక విమానంలో కేరళకు తరలించారు.

మరోవైపు కేరళ వరద బాధితుల్ని ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. విక్రమ్ 35 లక్షల సాయాన్ని ప్రకటించారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, మోహన్‌లాల్, మమ్ముట్టి, సూర్య, విజయ్‌ సేతుపతి, ప్రభాస్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌ 25 లక్షల చొప్పున ప్రకటించారు. నాగార్జున 28 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఎస్‌బీఐ 2 కోట్లు, ఆటోమొబైల్‌ కంపెనీ హుందాయ్‌ కోటి అందించింది. సన్‌ టీవీ కోటి సాయాన్ని ప్రకటించింది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, రామ్‌చరణ్‌లు కలిసి 50 లక్షలతో పాటు మరో 10 లక్షల విలువైన మందులు అందించారు. కేరళ ప్రజలు ప్రేమగా మల్లు అర్జున్‌ అని పిలుచుకునే బన్నీ 25 లక్షలు ప్రకటించగా.. కల్యాణ్‌రామ్ 10 లక్షలు ఇచ్చారు. యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ 5 లక్షలు, దర్శకుడు కొరటాల శివ 3 లక్షలు తమవంతు సాయంగా అందజేశారు. ఇటీవల ఘనవిజయం సాధించిన గీత గోవిందం చిత్ర నిర్మాత బన్నీ వాసు… తమ చిత్ర కేరళ వసూళ్లను సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం ఇస్తున్నట్లు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com