నవ్యాంధ్ర రాజధానిలో కలియుగ ప్రత్యక్ష దైవం..

- August 23, 2018 , by Maagulf
నవ్యాంధ్ర రాజధానిలో కలియుగ ప్రత్యక్ష దైవం..

అమరావతి:నవ్యాంధ్ర రాజధానిలో కలియుగ ప్రత్యక్ష దైవం కొలువుదీరనున్నాడు. 25 ఎకరాల్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు ఏపీ సర్కార్‌ సిద్ధమైంది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన వెంకటేశ్వరస్వామి ఆలయ నమూనాలకు సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు.

ఉండవల్లిలో చంద్రబాబు సీఆర్డీఏపై అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో అధికారులు వెంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన డిజైన్లను సీఎం ఎదుట ప్రదర్శించారు. ఆలయ నమూనాలపై సంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు… ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా పవిత్రతకు ప్రాధాన్యమిస్తూ నిర్మాణం జరగాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో నిర్మిస్తున్నందున ప్రత్యేకంగా భావించి ప్రజలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని కోరారు.

అమరావతిలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ నమూనాలను సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా ఆమోదించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఉండవల్లి సమీపంలో 25 ఎకరాల్లో ఆలయం నిర్మిస్తామన్నారు. ఇందుకోసం 140 కోట్లు అవుతుందని అంచనా వేశామని.. టీటీడీ ఆమోదం పొందిన వెంటనే టెండర్లు పిలుస్తామని చెప్పారు.

మరోవైపు సీఆర్డీఏ సమీక్ష సమావేశంలో విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు అభివృద్ధిపైనా చర్చించారు. మెట్రో అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన దక్షిణ కొరియాకు చెందిన నిర్మాణ సంస్థలు తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి వివరించాయి. పారిశ్రామిక, మౌలిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ పెద్దఎత్తున అభివృద్ధి జరుగుతోందని సీఎం వారికి తెలిపారు. అనంతపురం జిల్లాలో దక్షిణ కొరియాకు చెందిన కియా కార్ల పరిశ్రమ వేగవంతంగా నిర్మాణం జరుగుతోందన్నారు. ఇక.. విజయవాడ నుంచి ప్రవహించే బందర్ కాలువతో పాటు మూడు కాలువలను ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే ప్రణాళికను సీఎం సమీక్షించారు. వైకుంఠపురం, చోడవరం నుంచి అటు అమరావతి వరకు ఉన్న విశాలమైన నదీ తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మొత్తం 27 కిలోమీటర్ల మేర ఉన్న ఈ తీరప్రాంతాన్ని నీలి-హరిత సుందర ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com