ఆట‌గాళ్ళు:రివ్యూ

- August 24, 2018 , by Maagulf
ఆట‌గాళ్ళు:రివ్యూ

చిత్రం: ఆట‌గాళ్ళు
న‌టీన‌టులు: నారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబు, బ్ర‌హ్మానందం, ద‌ర్శ‌న బానిక్ త‌దిత‌రులు
సంగీతం: సాయికార్తీక్‌
ఛాయాగ్ర‌హ‌ణం: విజ‌య్ సి కుమార్
కూర్పు: మార్తాండ్ కె.వెంక‌టేష్‌
మాట‌లు: గోపి
నిర్మాత‌లు: వాసిరెడ్డి ర‌వీంద్ర‌నాథ్, వాసిరెడ్డి శివాజీ ప్ర‌సాద్, రాము మ‌క్కెన‌, వ‌డ్ల‌పూడి జితేంద్ర‌
ద‌ర్శ‌క‌త్వం: ప‌రుచూరి ముర‌ళి
సంస్థ‌: ఫ్రెండ్స్‌ అండ్ క్రియేష‌న్స్
విడుద‌ల తేదీ: 24-08-2018

క‌థ‌ల ఎంపిక‌లో నారా రోహిత్ ప్ర‌త్యేక‌త‌ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. జ‌గ‌ప‌తిబాబు కూడా ఈ మ‌ధ్య బ‌ల‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తూ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తున్నారంటే త‌ప్ప‌కుండా అందులో ఓ కొత్త‌క‌థ ఉంద‌నే ఊహిస్తారు ప్రేక్ష‌కులు. ‘పెద‌బాబు’, ‘ఆంధ్రుడు’ చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్న ప‌రుచూరి ముర‌ళి ద‌ర్శ‌క‌త్వంలో ఆ సినిమా అంటే వాణిజ్యాంశాలు కూడా ఊహిస్తారు ప్రేక్ష‌కులు. మ‌రి ఆస‌క్తి రేకెత్తించే ఈ క‌ల‌యిక‌లో వచ్చిన ‘ఆట‌గాళ్లు’ సినిమా ఎలా ఉంది? ఆట ఎవ‌రి కోసం ఎవ‌రు ఆడారు?

క‌థేంటంటే: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ (నారా రోహిత్‌) త‌న ప్రేయ‌సి అంజ‌లి (ద‌ర్శ‌న బానిక్‌)ని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ల వైవాహిక జీవితం స‌వ్యంగా సాగుతున్న ద‌శ‌లోనే అంజ‌లి హ‌త్య‌కి గుర‌వుతుంది. ఆ నేరంపై సిద్ధార్థ్ అరెస్ట్ అవుతాడు. ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ అయిన వీరేంద్ర (జ‌గ‌ప‌తిబాబు) కేసు కోసం రంగంలోకి దిగుతాడు. జ‌డ్జి అనుమ‌తితో సిద్ధార్థ్‌ని క‌స్ట‌డీలో ప్ర‌శ్నించ‌డం మొద‌లుపెడ‌తాడు. ఆ క్ర‌మంలో సిద్ధార్థ్ త‌న గురించి వీరేంద్ర‌కి ఏం చెప్పాడు? నిజంగా సిద్ధార్థే త‌న భార్య‌ని అంతం చేశాడా? ఈ కేసు ఎన్ని మ‌లుపులు తిరిగింది? సిద్ధార్థ్‌కీ, వీరేంద్ర‌కీ మ‌ధ్య సాగిన ఆటలో గెలుపెవ‌రిద‌నే విష‌యాలు తెర‌పైనే చూడాలి.

ఎలా ఉందంటే: ఇద్ద‌రు తెలివైన వ్యక్తుల మ‌ధ్య మైండ్ గేమ్‌గా సాగే చిత్ర‌మిది. క‌థ ఎత్తుగ‌డ ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. భార్య‌ని హ‌త్య చేసిన కేసులో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడైన సిద్ధార్థ్ అరెస్ట్ అవుతాడు. ఆ స‌న్నివేశాలే ప్రేక్ష‌కుడిలో ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. క‌థ‌లో తొంద‌ర‌గా లీన‌మ‌య్యేలా చేస్తాయి. విచార‌ణ కోసం క‌స్ట‌డీలోకి వెళ్లిన లాయ‌ర్ వీరేంద్ర‌కి త‌న క‌థని చెప్ప‌డం మొద‌లుపెడ‌తాడు సిద్ధార్థ్‌. దాంతో ఫ్లాష్ బ్యాక్ మొద‌ల‌వుతుంది. ఆరంభం మామూలుగా అనిపించినా, ఆ త‌ర్వాత క‌థ లోతుల్లోకి వెళ్లేకొద్దీ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. అయితే, మ‌ధ్య‌లో నారా రోహిత్‌, బ్ర‌హ్మానందంల మ‌ధ్య సాగే కామెడీ ట్రాక్ అంతగా నవ్వులు పంచలేదు.

మైండ్ గేమ్ అంతా ద్వితీయార్ధంలోనే మొద‌ల‌వుతుంది. ఈ త‌ర‌హా సినిమాల‌కి క‌థ‌, క‌థ‌నాలు ఎంత ముఖ్య‌మో.. వాటిని అంతే ప‌క‌డ్బంధీగా... ఆద్యంతం ప‌ట్టు స‌డ‌ల‌కుండా తెర‌పైకి తీసుకురావ‌డం అంతే ముఖ్యం. క్రైమ్ డ్రామా క‌థ‌లు త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తిని పెంచాలి. జ‌గ‌ప‌తిబాబు, నారా రోహిత్ మ‌ధ్య స‌న్నివేశాల వ‌ర‌కు ద‌ర్శ‌కుడు బాగా క‌స‌ర‌త్తు చేశారు. కానీ, మొత్తంగా అదే త‌ర‌హా ఫీల్ పండించ‌డంలో త‌డ‌బాటు పడ్డారు. అక్క‌డ‌క్క‌డ స‌న్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతున్న‌ట్టు అనిపిస్తాయి. ప‌తాక స‌న్నివేశాల్లో మ‌లుపులు ఆక‌ట్టుకుంటాయి. ప్ర‌థ‌మార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం ప్రేక్ష‌కుడికి మంచి వినోదాన్ని పంచుతుంది.

ఎవ‌రెలా చేశారంటే: ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌గా జ‌గ‌ప‌తిబాబు లుక్‌, ఆయ‌న హావ‌భావాలు చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. నారా రోహిత్ కూడా సిద్ధార్థ్ పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయారు. ఆయ‌న పాత్ర ప్రేక్ష‌కులకి థ్రిల్‌ని పంచుతుంది. గాఢ‌త‌తో కూడిన న‌ట‌నని ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం చేశారు రోహిత్‌. ద‌ర్శ‌న‌బానిక్ అందంతో ఆక‌ట్టుకుంటుంది. బ్ర‌హ్మానందం ద్వితీయార్ధంలో కూడా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు కానీ, ఆ స‌న్నివేశాలు అంతగా పండ‌లేదు. వాణిజ్య చిత్రాల్ని, కుటుంబ క‌థ‌ల్ని తెర‌కెక్కించి మెప్పించిన ప‌రుచూరి ముర‌ళి, ఈసారి ఓ క్రైమ్ డ్రామాని ఎంచుకున్నారు. ఆయ‌న క‌థ సిద్ధం చేసుకొన్న విధానం, పాత్ర‌ల్ని తీర్చిదిద్దిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ఈ త‌ర‌హా చిత్రాల‌కి గ్రిప్పింగ్‌గా సాగే క‌థ‌నం చాలా ముఖ్యం. ఆ విష‌యంలోనే ప‌రుచూరి ముర‌ళి తడబడ్డారు. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. సాయికార్తీక్ నేప‌థ్య సంగీతం, విజ‌య్ సి.కుమార్ కెమెరా ప‌నిత‌నం క‌థ‌కి బ‌లాన్నిచ్చాయి. సాంకేతికంగా సినిమా బాగుంది.

బలాలు
+ నారారోహిత్... జ‌గ‌ప‌తిబాబు న‌ట‌న‌
+ ఆ ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నివేశాలు
+ క‌థ

బ‌ల‌హీన‌త‌లు
- లాజిక్‌లేని స‌న్నివేశాలు
- ప‌స లేని క‌థ‌నం

 

--మాగల్ఫ్ రేటింగ్:2/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com