కరుణానిధికి కోలీవుడ్ ప్రముఖుల ఘన నివాళి

- August 25, 2018 , by Maagulf
కరుణానిధికి కోలీవుడ్ ప్రముఖుల ఘన నివాళి

చెన్నై: తమిళ భాష, తమిళ ప్రజలు ఉన్నంతవరకూ కరుణానిధి చిరంజీవిగా ఉంటారని ప్రముఖ సినీ దర్శకుడు భారతీ రాజా అన్నారు. దివంగత డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మృతికి సంతాప సూచకంగా కోయంబత్తూరులో 'మరక్కముడియుమా కలంజరై' (కలైంజర్‌ను మరువగలమా?) అనే అంశంపేరుతో శనివారం సాయంత్రం నివాళి కార్యక్రమం జరిగింది. ఈ సభలో భారతీరాజా మాట్లాడుతూ... కరుణ బాటలో ఆయన ఆశయాలను, పార్టీ లక్ష్యాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్న డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు ఎంకేస్టాలిన్‌ తమిళ ప్రజలకు ఆశాజ్యోతి అని, త్వరలో ఆయన తండ్రిలాగే వెలుగులు చిమ్మటం ఖాయమని అన్నారు.
తెలుగు సినీనటుడు మోహన్‌బాబు మాట్లాడుతూ... ధైర్యసాహసాలకు మారుపేరు కరుణ అని, ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహపురుషుడని కొనియాడారు. అన్నాదురై, కరుణానిధిని వేరుపరచి చూడలేమని, ఇద్దరూ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం పాటుపడ్డారని అన్నారు. నటుడు ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడుతూ... కరుణ బతికున్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడకపోవడం దురదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తమిళనాట ఆయన ఉచిత పథకాలు అమలు చేస్తున్నారని కాస్త ఏవగించుకున్న మాట వాస్తవమే కానీ, ఆ తర్వాత ఆ ఉచిత పథకాల వల్ల నిరుపేద గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నింపిందని తెలుసుకుని ఆశ్చర్యపోయానని అన్నారు.
నటి రాధిక మాట్లాడుతూ... కరుణ డైలాగులు సమకూర్చిన చిత్రంలో తాను నటించడం అదృష్టంగా భావిస్తున్నాని పేర్కొన్నారు. నాజర్‌ మాట్లాడుతూ.. కరుణ సంభాషణలు రాసిన ఐదు చిత్రాల్లో నటించడంతో తన జన్మధన్యమైందని కొనియాడారు. ప్రముఖ నటుడు శివకుమార్‌ మాట్లాడుతూ.. సినీ రంగంలో కరుణానిధి చరిత్ర సృష్టించారని, 66 ఏళ్లకు ముందు కరుణ సంభాషణలు సమకూర్చిన పరాశక్తి సినిమా కోర్టు సీన్‌తో ముగియడం అప్పట్లో కొత్తదనంతో కూడిన క్లైమాక్స్‌గా తీవ్ర సంచలనం కలిగించిందన్నారు. ఆ కోర్టు సీన్‌ సంభాషణలు గ్రామఫోన్లుగా వెలువడ్డాయని, తామంతా ఆ డైలాగులను కంఠస్థం చేసేవాళ్లమన్నారు. ఆ సీన్‌ డైలాగులను శివకుమార్‌ తడబాటు లేకుండా వినిపించి సభికుల కరతాళధ్వనులందుకున్నారు. కరుణ సామాజిక న్యాయం కోసమే పోరాడారని, తన లక్ష్యాలను సినిమాలలో డైలాగులుగా వెలువరించారని అన్నారు. తన సినీ సంభాషణలను తనకు తెలియకుండా మార్చకూడదని, హీరోగా ఎంజీఆరే నటించాలంటూ షరతులు పెట్టిన ధైర్యవంతుడైన సంభాషణల రచయిత కరుణేనని అన్నారు. ఆనాటి సినీ నిర్మాత టి.ఆర్‌ సుందరం ఎదుట కుర్చీలో 24 ఏళ్ల వయస్సులో సంభాషణల రచయిత హోదాలో కూర్చున్న ఏకైక వ్యక్తి కరుణానిధేనని అన్నారు. ఎంజీఆర్‌, శివాజీ, కరుణ ఒక తల్లి బిడ్డలుగా ఉండేవారని చెప్పారు.
నటుడు ప్రభు ప్రసంగిస్తూ.. తన తండ్రి శివాజీగణేశన్‌ నిలువెత్తు విగ్రహాన్ని మెరీనాబీచ్‌లో ప్రతిష్ఠించేందుకు చివరిక్షణం దాకా పాటుపడిన వ్యక్తి కరుణానిధి అన్నారు. కరుణను తానెప్పుడూ పెదనాన్నగానే భావించేవాడినని, ఆయనకు మరణం లేదని, తమిళ ప్రజలు హృదయాల్లో నిత్యం కొలువై వుంటారని అన్నారు. నటుడు రాధారవి మాట్లాడుతూ.. కరుణ కలలను నెరవేర్చేందుకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. తమిళనాడు అని చెబితే ఉత్తరాది ప్రజలకు చటుక్కున గుర్తుకు వచ్చే నాయకుడు కరుణానిధి అని పేర్కొన్నారు. ఈ నివాళి కార్యక్రమంలో ఇంకా సత్యరాజ్‌, పార్తీబన్‌, డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు స్టాలిన్‌, సీనియర్‌ నాయకుడు దురైమురుగన్‌, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి ఉదయనిధి స్టాలిన్‌, కేంద్ర మాజీ మంత్రి రాజా తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com