అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు

- August 30, 2018 , by Maagulf
అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు

రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య మహా ప్రస్థానంలో నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ముగిసాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. చివరి క్రతువులో కుమారులు కళ్యాణ్‌ రామ్.. జూనియర్‌ ఎన్టీఅర్‌లు కన్నీరు మున్నీరు అయ్యారు. రెండో కొడుకు కళ్యాణ్‌రామ్‌ తండ్రి చితికి నిప్పంటించారు. అటు.. తెలుగు రాష్ట్రాల మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మహాప్రస్థానానికి వచ్చి.. హరికృష్ణకు అంత్యక్రియలో పాల్గొన్నారు.

హరికృష్ణ భౌతిక కాయం మహా ప్రస్థానానికి చేరుకున్న తరువాత ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. నిన్నటి నుంచి హరికృష్ణ నివాసం దగ్గరే ఉన్న చంద్రబాబు.. అంతిమ యాత్ర సమయంలో ముందు నిలబడి పాడె మోసారు. తరువాత అంతిమయాత్రలో భౌతిక కాయం ఉన్న వ్యాన్‌లోనే మహా ప్రస్థానానికి చేరుకొని.. అంత్యక్రియలను దగ్గరుండి జరిపించారు.. హరికృష్ణ కుటుంబానికి పెద్ద అండగా నిలిచి.. అన్ని తానై వ్యవహరించారు..

అంతకుముందు అశేష అభిమాన వాహిని మధ్య అంతిమ యాత్ర సాగింది. మెహిదీపట్నం, టోలీచౌకీ, షేక్ పేట్ నాలా మీదుగా మహాప్రస్థానం వరకు గంటన్నర పాటు అంతిమయాత్ర సాగింది. ప్రియమైన నేతకు చివరిసారి చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. హరికృష్ణ దుర్మరణాన్ని అభిమానులు, టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆప్యాయంగా మాట్లాడే మంచి మనిషిని కోల్పోయిన బాధ ప్రతి ఒక్కరిలో కనిపించింది. ముక్కుసూటి తనంతో, తనదైన విలక్షణ వ్యక్తిత్వంతో రాజకీయాలతోపాటు, సినీ జీవితంలోనూ తనదైన ముద్ర వేసిన హరికృష్ణను అంతా స్మరించుకుంటున్నారు. అంతులేని విషాదంలో ఉన్న కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌లను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు..

అంతిమ యాత్రకు ముందు నందమూరి హరికృష్ణ నివాసంలో కర్మకాండలకు సంబంధించిన క్రతువు నిర్వహించారు. కృష్ణా జిల్లాకు చెందిన వేద పండితులు, ఇద్దరు కుమారులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌ చేత జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించారు. తండ్రి జ్ఞాపకాలు కళ్ల ముందే కదలాడుతుండడంతో దుఖాన్ని ఆపుకోవడం ఇద్దరికీ సాధ్యం కావడం లేదు. కర్మకాండ సమయంలో…. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ స్నేహితులు, ఏపీ-తెలంగాణకు చెందిన మంత్రులు, ఇతర ముఖ్యులు కూడా అక్కడే ఉన్నారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలంటూ శ్రద్ధాంజలి ఘటించారు 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com