తెలంగాణ:డిసెంబర్‌లో ఎన్నికలు!

- September 04, 2018 , by Maagulf
తెలంగాణ:డిసెంబర్‌లో ఎన్నికలు!

తెలంగాణ:ముందస్తు ఎన్నికల కసరత్తుల్లో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఎర్రవల్లి నుంచి ముందస్తు వ్యూహ రచన చేస్తున్నారు. ప్రగతి నివేదన సభ ఇచ్చిన జోష్‌తో మరో బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. సెప్టెంబర్‌ 7న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భారీ బహిరంగతో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సై అన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ సీఎస్‌ జోషితో అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్లు భేటీ అవ్వడం.. ఆ వెంటనే గవర్నర్‌తో సీఎస్‌ ప్రత్యేకంగా సమావేశం అవ్వడంతో.. రాష్ట్రంలో ముందస్తు తథాస్తు అనే సంకేతాలు వచ్చేస్తున్నాయి.

అధికార పార్టీ కారు గేరు మార్చి స్పీడ్‌ పెంచేసింది. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేసినట్టే కనిపిస్తున్నారు. అందుకే జెట్‌ స్పీడ్‌తో ఆయన ఎన్నికల వ్యూహాన్ని సిద్దం చేస్తున్నారు. 50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయడానికి సిద్ధమయ్యారు. ముందస్తుకు సంబంధించి ఇప్పటికే లాంచనాలన్నీ ఒక్కక్కటిగా కేసీఆర్‌ పూర్తి చేస్తూ వస్తున్నారు.

మరోవైపు వరుస రెండు కేబినెట్‌ భేటీలు పెట్టి కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు ప్లాన్‌చేస్తున్నారు. 6న తెలంగాణ కేబినెట్ సమావేశం ఉండే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన అంశాలన్నిటికి ఆమోదముద్ర వేస్తూనే.. అసెంబ్లీ రద్దుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాలని సీఎం భావిస్తున్నట్లుగా సమాచారం.. ఆ వెంటనే 7న హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభలో తొలి ఎన్నిక శంఖం పూరించేందుకు సీఎం సిద్ధమయ్యారు.

7వ తేదీ కేసీఆర్ సెంటిమెంట్‌ డేగా చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో మంచిదన్న భావనతో ఆ రోజు నుంచి సభలు, సమావేశాలు నిర్వహించుకుంటే బాగుంటుందని జ్యోతిష్కులు కేసీఆర్‌కు చెప్పినట్టు సమాచారం. 2014 ఎన్నికల ప్రచారాన్ని హుస్నాబాద్ నుండే కేసీఆర్ ప్రారంభించారు. మరోసారి అదే సెంటిమెంట్‌ను ఫాలో అయ్యేందుకు గులాబి బాస్‌ సై అంటున్నారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో హుస్నాబాద్‌లో జరగనున్న సభ ఏర్పాట్లను మంత్రులు హరీష్‌రావు‌, ఈటల రాజేందర్‌లు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే బహిరంగసభ ఏర్పాట్లు, సభాస్థలిని హరీశ్ రావు, ఈటల, ఎంపీ వినోద్, ఎమ్మెల్యే సతీశ్ లతో కలిసి పరిశీలించారు. హుస్నాబాద్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న బహిరంగ సభ పేరు ప్రజల ఆశీర్వాద సభ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడమే ఈ సభల ప్రధాన ఉద్దేశమని మంత్రులు స్పష్టం చేశారు.

మరోవైపు ప్రభుత్వ ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్ జోషి, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహా చారి భేటీ అయ్యారు. వీరంతా కేబినెట్‌ ఎజెండా, అసెంబ్లీ రద్దు అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ కూడా సీఎస్‌తో భేటీ అయ్యారు. అటు ఈ సమావేశాల తరువాత సీఎస్‌ వెళ్లి గవర్నర్‌తో సమావేశం కావడంతో ముందస్తు చుట్టూనే చర్చలు సాగుతున్నాయని ప్రచారం మొదలైంది.

సెప్టెంబర్‌ ఆరున ఏకాదశి కావడంతో.. సెంటిమెంట్‌గా అదే రోజున సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ రద్దుపై ప్రకటన చేస్తారని టి.ఆర్‌.ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు డిసెంబర్‌లోనే నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు.. తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని గులాబి దళం అంచనాకు వచ్చేసినట్టు ఉంది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com