ఆసియా కప్:పాక్ పై భారత్ విజయ భేరి
- September 19, 2018
దుబాయ్: ఆసియా కప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను భారత్ చిత్తుగా ఓడించింది. అన్ని విభాగాల్లో సమష్టిగా సత్తా చాటింది. ఇంకా 21 ఓవర్లు మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టీమిండియా బౌలర్లు దాయాదిని 162 పరుగులకే కుప్పకూల్చారు. ఆ తర్వాత ఓపెనర్లు రోహిత్ శర్మ (52; 39 బంతుల్లో 6×4, 3×6), శిఖర్ ధావన్ (46; 54 బంతుల్లో 6×4, 1×6) చెలరేగి శుభారంభం అందించారు. అంబటి రాయుడు (31; 46 బంతుల్లో 3×4), దినేశ్ కార్తీక్ (31; 37 బంతుల్లో 2×4, 1×6) అజేయంగా నిలిచి గెలుపు లాంఛనం పూర్తిచేశారు. భారీ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకు పడిన రోహిత్ 36 బంతుల్లో అర్ధశతకం చేశాడు. ఇది అతడి కెరీర్‌లో వేగవంతమైన అర్ధశతకం కావడం గమనార్హం.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్రత్యర్థిని భారత్ 43.1 ఓవర్లకు కేవలం 162 పరుగులకే కుప్పకూల్చింది. బౌలర్లు కేదార్ జాదవ్ (3/23), భువనేశ్వర్ కుమార్ (3/15), జస్ర్పీత్ బుమ్రా (2/23) పాక్ నడ్డి విరిచారు. బాబర్ ఆజామ్ (47; 62 బంతుల్లో 6×4), షోయబ్ మాలిక్ (43; 67 బంతుల్లో 1×4, 1×6) మాత్రమే రాణించారు. త్రుటిలో అర్ధశతకాలు చేజార్చుకున్నారు. బుమ్రాతో కలిసి కట్టుదిట్టంగా బంతులు విసిరిన భువి వరుస ఓవర్లలో ఓపెనర్ ఇమాముల్ హక్ (2; 7 బంతుల్లో), ఫకర్ జమాన్ (0; 9 బంతుల్లో)ను ఔట్ చేసి టీమిండియాకు ఆధిక్యం అందించాడు. దీంతో పాక్ 3/2తో నిలిచింది. ఈ క్రమంలో బాబర్ ఆజామ్, షోయబ్ మాలిక్ జోరు పెంచి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది మూడో వికెట్‌కు 82 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు.
టీమిండియా మణికట్టు మాంత్రికులను అలవోకగా ఎదుర్కొంటున్న షోయబ్ మాలిక్ అర్ధశతకం చేసేలా కనిపించాడు. ఈ పరిస్థితుల్లో చాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన కేదార్ జాదవ్ తన జాదూతనం చూపించాడు. 24.5వ బంతికి పాక్ సారథి సర్ఫరాజ్ అహ్మద్ (6; 12 బంతుల్లో)ను పెవిలియన్ పంపించాడు. అతడు వేసిన 26.6వ బంతికి ధాటిగా ఆడుతున్న మాలిక్ (43; 67 బంతుల్లో 1×4, 1×6) అనసవర పరుగు తీసి రనౌట్ అయ్యాడు. కుల్‌దీప్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన అసిఫ్ అలీ (9; 10 బంతుల్లో 1×6) సైతం జాదవ్ వేసిన 28.1 బంతికి ధోనీకి సులభ క్యాచ్ ఇచ్చాడు. దీంతో 30 ఓవర్లకు పాక్ 113/6తో నిలిచింది. 150 పరుగుల దాటడం కష్టమే అనిపంచింది. కాసేపు ఫహీమ్ అష్రఫ్ (21; 44 బంతుల్లో 2×4), మహ్మద్ ఆమిర్ (18 నాటౌట్; 26 బంతుల్లో 1×4) నిలకడగా ఆడి 37 పరుగుల భాగస్వామ్యంతో స్కోరు 150 దాటించారు. అయితే అఫ్రఫ్, ఉస్మాన్ ఖాన్‌ను బుమ్రా ఔట్ చేసి పాక్‌ను 162 పరుగులకు పరిమితం చేశాడు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







