భారత్‌కు చెమటలు పట్టించిన ఆఫ్ఘనిస్తాన్..మ్యాచ్‌ ‘టై

- September 25, 2018 , by Maagulf
భారత్‌కు చెమటలు పట్టించిన ఆఫ్ఘనిస్తాన్..మ్యాచ్‌ ‘టై

దుబాయ్:ఆసియా కప్‌లో పసికూన లాంటి అఫ్గానిస్తాన్‌ అసమాన పోరాట పటిమ కనబర్చింది. దుబాయ్‌ వేదికగా జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియాను ఓటమి అంచుల దాకా నెట్టింది. భారత్‌ ఈజీగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌ను టైగా మార్చేసింది. కెప్టెన్‌గా ధోనీకి ప్రతిష్టాత్మకమైన 200వ వన్డేలో చేదు జ్ఞాపకాలు మిగిల్చింది. భారత్‌ గెలవాల్సిన మ్యాచ్‌ను టై వరకు తీసుకు వచ్చిన అఫ్గాన్‌ జట్టు.. సగర్వంగా ఆసియా కప్‌ నుంచి తిరుగుముఖం పట్టింది.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. షహజాద్‌ 124 పరుగులతో చెలరేగితే.. మొహమ్మద్‌ నబీ 64 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత బౌలర్లలో జడేజాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ 60 పరుగులు, అంబటి రాయుడు 57 పరుగులు చేశారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించారు. రాయుడు, రాహుల్‌ ఔటయ్యాక బ్యాటింగ్‌ వచ్చిన ధోని, పాండేలు… చెరో ఎనిమిది పరుగులకే వెనుదిరిగారు. ఆ తర్వాత 19 పరుగులకే జాదవ్‌ రనౌట్‌ కాగా… 44 పరుగులు చేసిన కార్తీక్‌ కూడా కీలక సమయంలో పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత అనుభవం లేని బ్యాట్స్‌మెన్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. చివరి ఓవర్లో విజయానికి భారత్‌కు 7 పరుగులు అవసముండగా.. జడేజా క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగు బంతుల తర్వాత స్కోర్లు సమమయ్యాయి. మరో రెండు బంతుల్లో సింగిల్‌ తీయాల్సి ఉండగా జడేజా ఔటవ్వడంతో.. మ్యాచ్‌ టైగా ముగిసింది.

మరోవైపు ఆసియాకప్‌ ఫైనల్లో భారత్‌ ప్రత్యర్థి ఎవరో నేడు తేలిపోతుంది. సాయంత్రం అబుదాబి వేదికగా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ తలపడనున్నాయి. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com