భారత్ వైఖరిపై అసహనం వ్యక్తం చేసిన పాక్

- September 27, 2018 , by Maagulf
భారత్ వైఖరిపై అసహనం వ్యక్తం చేసిన పాక్

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన సార్క్ మంత్రుల భేటీ నుంచి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మధ్యలోనే లేచివెళ్లిపోయారు. ఈ ఘటన పట్ల పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సార్క్ దేశాల ప్రగతిలో ఒక దేశ ప్రవర్తనే అవరోధంగా మారిందని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి ఆరోపించారు. భారత్ నుంచి పాజిటివ్ స్పందన లేదని, సుష్మా సమావేశాల నుంచి మధ్యలోనే వెళ్లిపోయారని పాక్ మంత్రి విమర్శించారు. అయితే ఇతర కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో సుష్మా.. సార్క్ భేటీ నుంచి అకస్మాత్తుగా వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ అంతకముందు సుష్మా స్వరాజ్ చాలా స్పష్టమైన సందేశాన్నిచ్చారు. దక్షిణ ఆసియా దేశాలకు ఉగ్రవాదం వల్ల పెను ప్రమాదం ఉందని, అలాంటి సందర్భాల్లో ప్రాంతీయ సహాకారాన్ని ఆశించలేమని సుష్మా తన ప్రసంగంలో తెలిపారు. రోజు రోజుకూ ఉగ్ర ఘటనలు దక్షిణ ఆసియాలో ఎక్కువ అవుతున్నాయని, ఉగ్రవాదమే మన ప్రాంతంలో శాంతి విఘాతంగా మారిందని, అన్ని రూపాల్లో ఉన్న ఉగ్రవాదాన్ని రూపుమాపాలని, ఉగ్రమూకలకు చేయూతనిస్తున్న వారిని కూడా వెలివేయాలని సుష్మా అన్నారు. తీర్మానాలను అమలు చేస్తేనే ప్రగతి ఉంటుందని సుష్మా తెలిపారు. పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి మాత్రం ఇండియా వైఖరిని తప్పుపట్టారు. సదస్సులో పాల్గొనకుండా, అనుకూల వాతావరణం ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com