నోటా:రివ్యూ

- October 05, 2018 , by Maagulf
నోటా:రివ్యూ

నటీనటులు: విజయ్ దేవరకొండ, సత్యరాజ్, నాజర్, మెహరీన్, ప్రియదర్శి, కరుణాకరన్ తదితరులు
కెమెరా: సంతానకృష్ణ రవిచంద్రన్ 
సంగీతం: శామ్ సిఎస్
నిర్మాణ సంస్థలు: కింగ్ ఆఫ్ హిల్స్, స్టూడియో గ్రీన్
నిర్మాత: కె.ఇ. జ్ఞానవేల్ రాజా 
దర్శకత్వం: ఆనంద్ శంకర్ 
విడుదల తేదీ: అక్టోబర్ 5, 2018

'అర్జున్‌రెడ్డి', 'గీత గోవిందం' విజయాల తరవాత విజయ్ దేవరకొండ నటించిన సినిమా కావడంతో 'నోటా'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ రాజకీయ నేపథ్యంలో సినిమా అనేసరికి విజయ్ దేవరకొండ కొత్తగా చేశాడో? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. అంచనాలు, ఆసక్తికి తగ్గట్టు సినిమా వుందా? లేదా? రివ్యూ చదివి తెలుసుకోండి.

కథ: 
ముఖ్యమంత్రి వాసుదేవ్ (నాజర్) మీద అవినీతి ఆరోపణలు రావడంతో సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) కేసు టేకప్ చేసి విచారణ చేపడుతుంది. నిజాయతీ నిరూపించుకునే వరకూ ముఖ్యమంత్రి పదవికి దూరంగా వుంటానని వాసుదేవ్ రాజీనామా చేస్తారు. తన కుమారుడు వరుణ్ (విజయ్ దేవరకొండ)ను అర్ధరాత్రి హుటాహుటిన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతారు. లండన్ నుంచి బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసమని ఇండియా వచ్చిన వరుణ్‌కి రాజకీయాలు అంటే ఆసక్తి లేదు. రెండు వారాలు డమ్మీ సీయంగా పదవిలో కూర్చుంటే చాలని తండ్రి చెబుతాడు. తండ్రికి అడ్డు చెప్పలేక వరుణ్ సరేనని అంటాడు. డమ్మీ సీయంకు ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి? రాజకీయాల్లో ఓనమాలు తెలియని డమ్మీ సీయం సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడు? వాసుదేవ్‌ని వ్యతిరేకించే పాత్రికేయుడు మహేంద్ర (సత్యరాజ్), వాసుదేవ్ కుమారుడికి ఎందుకు సహాయం చేశాడు? డమ్మీ సీయం కాస్తా ప్రజల అభిమానాన్ని చూరగొన్న రౌడీ సీయంగా ఎలా మారాడు? చివరికి ఏం చేశాడు? అనేది సినిమా.

విశ్లేషణ:

వరుణ్ (విజయ్ దేవరకొండ) వున్నట్టుండి ముఖ్యమంత్రిని అవుతాడు. ఏ పరిస్థితుల్లో ఏం చేయాలో అతడికి తెలియదు. ఒక క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు సలహా కోసం తన శ్రేయోభిలాషికి ఫోన్ చేస్తాడు. అప్పుడు అతను 'వీడియో గేమ్‌లో స్ట్రయిట్‌గా లాస్ట్ లెవల్‌కి వెళ్ళి ఎప్పుడైనా ఆడావా? ఎలా వుంటుంది?' అని అడుగుతాడు. వరుణ్ 'ఛాలెంజింగ్‌గా వుంటుంది' అని చెబుతాడు. 'ముఖ్యమంత్రి పదవినీ ఛాలెంజింగ్‌గా భావించి ముందడుగు వెయ్' అని శ్రేయోభిలాషి చెబుతాడు! - ఇదీ సినిమాలో ఓ సన్నివేశం. సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు దర్శకుడు ఆనంద్ శంకర్‌ జీవితంలో ఇటువంటి సన్నివేశం చోటు చేసుకుని వుండొచ్చు.

ఆనంద్ శంకర్‌కు ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. కాని పూర్తిస్థాయిలో కథ సిద్ధం కాలేదు. జస్ట్ ఒక ఐడియా మాత్రమే వుంది. అయితే... హీరో, నిర్మాత సినిమా చేయడానికి సిద్ధంగా వున్నారు. ఏం చేయాలని ఎవరినైనా అడిగితే 'ఐడియాను కథగా డెవలప్ చేయడానికి కొంత సమయం పడుతుంది. తర్వాత దానికి పకడ్బందీ స్క్రీన్‌ప్లై రాయడానికి మరికొంత సమయం పడుతుంది. వీడియో గైమ్‌లో లాస్ట్ లెవల్‌కి వెళ్ళినట్టు.. ఈ ఐడియాతో సినిమా సెట్స్ మీదకు వెళ్ళు. ఛాలెంజింగ్‌గా వుంటుంది" అని ఎవరైనా సలహా ఇచ్చారేమో! జస్ట్ ఒక ఐడియా... సగం సగం రాసిన సన్నివేశాలతో సినిమా తీసినట్టు అనిపిస్తుంది.

సినిమా ప్రారంభమే 'లీడర్', 'భరత్ అనే నేను' సినిమాలను గుర్తు తెస్తుంది. ఆయా సినిమాల్లో తండ్రి అకాల మరణంతో హీరోలు ముఖ్యమంత్రి పదవి చేపడతారు. ఇందులో హీరో తండ్రి ఒక స్వామిజీ మాటకు విలువ ఇచ్చి కుమారుణ్ణి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడతాడు. అదొక్కటే కొత్త మార్పు. కథా గమనంలో మార్పులు ఏమీ లేవు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని ఓ యువకుడు ఎలా రాటుదేలాడు? అనేది కథ. గతంలో వచ్చిన సినిమా కథను గుర్తుతెచ్చే కథను ఎంపిక చేసుకుని, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటే అంతకంటే అవివేకం మరొకటి వుండదు. ప్రేక్షకుల మదిలో మరో ఆలోచన రాకుండా పకడ్బందీ కథనం, సన్నివేశాలతో కథను పరుగులు పెట్టించాలి. 'నోటా' చిత్రానికి పని చేసిన వ్యక్తులు అటువంటి ప్రయత్నం చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశాక... అల్లర్లను అదుపులో పెట్టడానికి ముఖ్యమంత్రిగా వరుణ్ ఇచ్చిన స్పీచ్ ఒక్కటే ప్రేక్షకులను అలరిస్తుంది. తరవాత వచ్చే సన్నివేశాలు ఏవీ ఆకట్టుకోవు. ముఖ్యంగా ఇంటర్వెల్ తరవాత కుండపోత వర్షాలు, వరదలు సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. జయలలిత మరణం తరవాత తమిళనాడులో జరిగిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు కథ సిద్ధం చేసినట్టున్నాడు. ఒకవేళ తమిళ ప్రేక్షకులను సినిమా ఆకట్టుకుంటుందేమో? తెలుగులో మాత్రమే కష్టమే. ఏ దశలోనూ సినిమా ఆసక్తికరంగా సాగలేదు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే కొన్ని సన్నివేశాల్లో శామ్ సీఎస్ నేపథ్య సంగీతం బావుంది. తొలి పాటతో పాటు మరో పాటలో విజయ్ దేవరకొండ లిప్ సింక్ మిస్ అయ్యింది. కొన్ని సన్నివేశాల్లో చాలామంది లిప్ సింక్ మిస్ అయ్యింది. దాంతో సినిమాను తమిళంలో తీసి, తెలుగు డబ్బింగ్ చేశారా? తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీశామని, ద్విభాషా సినిమా అని అబద్ధం చెప్పారా? అని సందేహం కలుగుతోంది. సినిమా చివర్లో ఇచ్చిన ట్విస్ట్, హవాలా, మనీ లాండరింగ్ నేపథ్యంలలో రాసిన సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా లేవు.

నటీనటుల పనితీరు: 
నటుడిగా విజయ్ దేవరకొండ మెప్పించిన సందర్భాలు రెండు మూడు వున్నాయంతే. అతడిలో నటుణ్ణి పూర్తిగా వాడుకునే సందర్భాలు, సన్నివేశాలు సినిమాలో లేవు. పేలవమైన సన్నివేశాల్లో అతడు ఏం చేయలేక చూస్తున్నట్టు అర్థమవుతుంది. సినిమాలో మరో ఇద్దరు గొప్ప నటులు నాజర్, సత్యరాజ్ పరిస్థితి కూడా అంతే. కథానాయిక మెహరీన్ కంటే నాజర్ పక్కన కనిపించే కార్యకర్తలకు ఎక్కువ సేపు కనిపిస్తారు. పేరుకు ఆమెది కథానాయిక పాత్ర. కాని సినిమాలో కనిపించేది మాత్రం నాలుగైదు సన్నివేశాల్లో మాత్రమే. బలమైన కథ, సన్నివేశాలు కొరవడటంతో సినిమాలో నటీనటులు ఎవరికీ తమ ప్రతిభ చూపించే అవకాశం దొరకలేదు.

చివరగా: 'నోటా' అంటే 'none of the above' (పైవి ఏవీ కాదు) అని అర్థం. ఓ హిట్ సినిమాకు కావలసిన అంశాలను లైనుగా రాసుకుని, ఈ సినిమాలో అవన్నీ వున్నాయా? లేవా? అని చెక్ చేసుకుంటే 'నోటా' అనే సమాధానం వస్తుంది. విజయ్ దేవరకొండ స్టార్‌డమ్ ఒక్కటే సినిమాకు బలం! తమిళనాడు రాజకీయాలను గుర్తుచేసే విధంగా పలు సన్నివేశాలున్నాయి. అయితే అవేవీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేవు.

--మాగల్ఫ్ రేటింగ్: 2.5/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com