ఎన్నికల్లో అసత్య ప్రచారానికి చెక్‌ పెట్టనున్న ఫేస్‌బుక్‌

- October 06, 2018 , by Maagulf
ఎన్నికల్లో అసత్య ప్రచారానికి చెక్‌ పెట్టనున్న ఫేస్‌బుక్‌

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల సమయంలో తమ సామాజిక మాధ్యమం ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం కాకుండా ఫేస్‌బుక్‌ జాగ్రత్త చర్యలు చేపట్టింది. వందల మందితో కలిసి తమ వేదిక ద్వారా ఒక కార్యదళాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. అసత్య ప్రచారం, అశ్లీల మాటలు వ్యాప్తికాకుండా చూస్తామని హామీ ఇచ్చింది. '2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు, నిపుణుల బృందాలను ఒక్క చోటకు చేర్చబోతున్నాం' అని ఫేస్‌బుక్‌ అధికారి రిచర్డ్‌ అల్లీస్‌ మీడియాకు తెలిపారు.

'మా బృందంలో సెక్యూరిటీ నిపుణులు, సమాచార నిపుణులు, ఇతరులు ఉంటారు. భారత్‌లో ఎన్నికలకు సంబంధించిన వేర్వేరు రూపాల్లో వచ్చే అసత్య ప్రచారాన్ని వీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే వాస్తవ రాజకీయ వార్తలు, రాజకీయ ప్రచారానికి తేడాను కనిపెట్టడమే మా కార్యదళానికి ఉన్న అసలైన సవాల్‌. ఇప్పటికే సంస్థలో పని చేస్తున్న వారినే కాకుండా కొత్త వారినీ ఇందుకోసం నియమించుకుంటాం' అని ఆయన వెల్లడించారు.

హింసకు సంబంధించిన అసత్య వార్తలను తనిఖీ చేసేందుకు ఒక బృందం, ఇతర అసత్య సమాచారాన్ని తనిఖీ చేసేందుకు మరో నిజనిర్ధారణ బృందం పనిచేస్తాయని అలన్‌ వెల్లడించారు. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ను గెలిపించేందుకు ఫేస్‌బుక్‌ వేదికగా గుర్తుతెలియని వారు భారీ ఎత్తున అసత్య ప్రచారం చేపట్టారన్న వార్తలు రావడంతో ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌జుకర్‌ బర్గ్‌ సైతం సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ వేదిక సాయం చేయాలని కోరుకుంటున్నామని అలన్‌ పేర్కొన్నారు. భారత్‌, బ్రెజిల్‌, మెక్సికో, అమెరికా మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో ఫేస్‌బుక్‌ ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com