'అరవింద సమేత వీర రాఘవ' మూవీ రివ్యూ

- October 11, 2018 , by Maagulf
'అరవింద సమేత వీర రాఘవ' మూవీ రివ్యూ

బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్ 
నటీనటులు: ఎన్టీఆర్, పూజ హెగ్డే, ఇషా రెబ్బ, నాగబాబు, జగపతి బాబు, సునీల్, శ్రీనివాస రెడ్డి, నవీన్ చంద్ర, సితార, ఈశ్వరి రావు, రావు రమేష్ తదితరులు 
సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్ 
ఎడిటింగ్: నవీన్ నూలి 
సంగీతం : ఎస్ ఎస్ థమన్ 
ప్రొడ్యూసర్స్: చినబాబు(రాధాకృష్ణ) 
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస రావు 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే పరిచయం లేని పేరు. ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ.ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండానే పైకి వచ్చిన హీరో. హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే మంచి మాస్ హీరోగా హిట్స్ కొట్టిన ఎన్టీఆర్ తర్వాత చాలా రోజులు మాస్ మాస్ అంటూ చేతులు కాల్చుకున్నాడు. మళ్లీ పూరి జగన్నాధ్ తో కలిసి చేసిన టెంపర్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటినుండి నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ అంటూ విభిన్న కథా చిత్రాలతో విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ సినిమాల్లోకొచ్చిన కొద్ది కాలానికే దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా చెయ్యడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది, జులాయి సినిమాల టైంలోనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా కోసం వెంపర్లాడుతున్నాడంటూ వార్తలొచ్చాయి. కానీ ప్రచారం జరిగిన 12 ఏళ్లకి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో ఈ అరవింద సమేత వీరరాఘవ సినిమా తెరకెక్కింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అంటే మాటలతో పడగొట్టే మహోన్నత మాటల రచయిత, హీరో కెపాసిటీని బట్టి సినిమా చేయగలగడం, మాటలకందని నిశ్శబ్దంలో నుండి పుట్టుకొచ్చిన చురకత్తుల్లాంటి డైలాగ్స్ తో ప్రేక్షకుడు మనసుని దోచెయ్యగల సత్తా ఉన్న దర్శకుడు. మరి త్రివిక్రమ్ ట్రాక్ రికార్డులో అన్ని ప్రేక్షకుడికి నచ్చిన సినిమాలే గాని. ప్రేక్షకుడికి బోర్ కొట్టిన సినిమా లేదు. కానీ త్రివిక్రమ్ కి ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ తో తీసిన అజ్ఞాతవాసి తో త్రివిక్రమ్ పై అంచనాలు ఒక్కసారిగా పడిపోయిన టైంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా అనేసరికి ఒక వైపు అనుమానం, మరోవైపు ఆసక్తి. ఇక ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ మీద ఎలాంటి అపనమ్మకం పెట్టుకోకుండా అరవింద సమెతని చాలా తక్కువ టైం లో పూర్తి చేసాడు. మరి యంగ్ అండ్ ఎనెర్జటిక్ హీరో. పదునైన మాటల్తో పిచ్చెక్కించే దర్శకుడు కలిసి చేసిన అరవింద సమేత భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ తన విజయ పరంపర కొనసాగించాడా? త్రివిక్రమ్ ఈ సినిమా తో హిట్ కొట్టి అజ్ఞాతవాసి ప్లాప్ నుండి బయట పడ్డాడా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
కామద్ది గ్రామానికి చెందిన నారపరెడ్డి(నాగబాబు), నల్లగుడికి చెందిన బసిరెడ్డి(జగపతిబాబు)ఫ్యాక్షన్ ప్రత్యర్థులు. లండన్ లో చదువుకుని వచ్చిన వీరరాఘవరెడ్డి(ఎన్టీఆర్)ని స్టేషన్ నుంచి తీసుకొస్తున్నప్పుడు జరిగిన దాడిలో నారపరెడ్డి చనిపోతాడు. దీంతో ఇక గొడవలు వద్దని చెప్పిన నానమ్మ సుగుణ(సుప్రియ పాఠక్)సలహా మేరకు రాఘవ హైదరాబాద్ వెళ్ళిపోయి అజ్ఞాతంలో ఉంటూ నీలంబరి(సునీల్)గ్యారేజ్ లో ఆశ్రయం పొందుతాడు. ఆ సమయంలోనే క్రిమినల్ లాయర్(నరేష్)కూతురు అరవింద(పూజా హెగ్డే)పరిచయం ప్రేమగా మారుతుంది. కానీ బ్రతికే ఉన్న బసిరెడ్డి తన కొడుకు బాల్ రెడ్డి(నవీన్ చంద్ర)ద్వారా శత్రువు కోసం వేటాడుతూనే ఉంటాడు. ఈ క్రమంలో వీరరాఘవ జాడ తెలుస్తుంది. కానీ గ్రామంలో శాంతి కావాలని కోరుకున్న వీరరాఘవ అందుకోసం తమకు చెరోపక్క సాయంగా ఉన్న రాజకీయ పార్టీ నాయకుల(రావు రమేష్, శుభలేఖ సుధాకర్)సహాయం తీసుకుంటాడు. మరి మూర్ఖుడైన బసిరెడ్డి. వీర రాఘవ రెడ్డి చేసిన ప్రయత్నాలకు తలొగ్గాడా? వీరరాఘవ సమస్యలన్నీ చక్కబెడతాడా? నానమ్మ మాటల్తో ఆజ్ఞాతంలోకి వెళ్ళిన వీరరాఘవ మళ్ళీ ఎలాంటి ఏ పరిస్తితుల్లో బయటికి వస్తాడు? అరవింద ప్రేమతో పగను సాధించాలని చెప్పిన మాటలు రాఘవ వింటాడా? మరి ఇన్ని విషయాలు తెలియాలి అంటే అరవింద సమెతని మీరు ఫ్యామిలీ సమేతాగా చూస్తే తెలుస్తుంది.

నటీనటుల పనితీరు:

ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే వీర రాఘవ రెడ్డి గా మాస్ అండ్ యాక్షన్ లుక్ తో చంపేశాడు ఎన్టీఆర్. పేస్ ఎక్సప్రెషన్స్ కానివ్వండి. మొహంలో కోపాన్ని కానివ్వండి, ప్రేమను ఎక్ష్ప్రెస్స్ చేసే విధానం కానివ్వండి. ఎన్టీఆర్ అని విషయాల్లో అదరగొట్టాడు. సిక్స్ ప్యాక్ బాడీతో మాస్ ఫాన్స్ ని పిచ్చెక్కించాడు. గుండెల్లో బడబాగ్ని దాచుకున్న ఫ్యాక్షన్ లీడర్ గా పరకాయ ప్రవేశం చేసాడు. నిజానికి ఇలాంటి కత్తులు పట్టుకుని శత్రువుల వెంట పడే పాత్రలు ఎన్టీఆర్ కు కొత్త కాదు. కెరీర్ ప్రారంభంలోనే తన వయసుకు మించిన బరువైనవి సింహాద్రి, ఆది, సాంబ సినిమాల్లో ఎన్టీఆర్ యాక్షన్ అండ్ మాస్ నట విశ్వరూపం చూసేసాం. ఆ సినిమాలు చూసిన సగటు ప్రేక్షకుడికి వీరరాఘవ రెడ్డి పాత్ర కొత్తదేమీ కాదు. కాకపోతే సీమ ఎపిసోడ్స్ లో ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ అవసరానికి మించిన సీరియస్ గా చూపడం కాస్త ఇబ్బంది పెడుతుంది. హీరోయిన్ పూజా హెగ్డే తో లవ్ ట్రాక్ నడుస్తున్నంత సేపు హుషారుగా ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత మరీ మూడీగా కనిపించడం. ఎన్టీఆర్ అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా కొంత నచ్చకపోయే అవకాశం ఉంది. కానీ సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ లో బెస్ట్ చూడొచ్చు. బాల్ రెడ్డితో రాజీ ఎపిసోడ్ తో పాటు క్లైమాక్స్ ముందు చప్పట్లు కొట్టించుకుంటాడు. కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇందులో ఇచ్చాడు. ఇక డాన్స్ విషయంలో రెడ్డి ఇటు చూడులో, అనగనగా పాటల్లో తప్ప ఎన్టీఆర్ డాన్స్ ని ఆస్వాదించలేకపోయాం. ఎన్టీఆర్ డాన్స్ విషయంలో ఫాన్స్ లో ఉన్న అసంతృప్తి కోడిగా మిగిలిపోయింది. ఇక అరవింద టైటిల్ పాత్రలో కనిపించిన పూజా హెగ్డే గ్లామర్ తో పాటుగా ఫస్ట్ హాఫ్ హాఫ్ లో బాగానే ఉపయోగపడింది. కథలో కీలక మలుపుకు కారణమే అయినప్పటికీ టైటిల్ లో సగం ప్రాధాన్యత ఇచ్చిన త్రివిక్రమ్ పాత్ర పరంగా అరవిందను అంత గొప్పగా చూపించలేకపోయారు. ఇక మొదటినుండి అనుకున్నట్లుగా పూజ సొంత గొంతు ఆమెకి సరిగా అతకలేదు. పూజ కేరెక్టర్ కి వేరే ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పిస్తే బావుండేది అనిపిస్తుంది. ఇక మరో హీరోయిన్ ఇషా రెబ్బాది. నటనకు స్కోప్ లేని పాత్ర. పూజా హెగ్డే చెల్లిగా ఈషా రెబ్బాది చాలా పరిమితమైన పాత్ర. ఇక విలన్ పాత్రలో జగపతి బాబు ఇరగదీసాడు. మూర్ఖుడైన విలన్ బసిరెడ్డి పాత్రలో మంచి ఆప్షన్ గా నిలిచాడు. బాగా మొరటుగా అనిపించే గెటప్ తో కళ్ళతోనే క్రూరత్వం పలికిస్తూ జీవం పోసాడు. ఎన్టీఆర్ తండ్రిగా నాగబాబు పాత్ర పరిమితం. ఎన్నో సార్లు ఆయన చేసిందే మనం చూసిందే. రావు రమేష్ రొటీనే. సునీల్ తన ఒరిజినల్ వింగ్ లోకి వచ్చి చేసిన సపోర్టింగ్ రోల్ సునీల్. నీలాంబరిగా ఒదిగిపోయాడు. శ్రీనివాస రెడ్డి, సీనియర్ నరేష్ లు ఉన్నవి కొన్ని సీన్లే అయినా డీసెంట్ కామెడీకి ఉపయోగపడ్డారు. నవీన్ చంద్ర మరీ విలన్ పక్కన ఉండే క్యారెక్టర్ రోల్స్ కి దిగిపోవడం కాస్త జీర్ణించుకోలేని విషయం. మిగతా నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:
త్రివిక్రమ్ నుండి సినిమా వస్తుంది అంటే చాలు సగటు ప్రేక్షకుడికి ఆటోమాటిక్ గా ఆసక్తి పెరుగుతుంది. రచయితగా త్రివిక్రమ్ మాటల్లో ఉన్న డెప్త్ అంత అద్భుతంగా ఉంటుంది. తన కలం బలంతో ప్రేక్షకులను కేవలం మాటలతోనే మరో లోకంలోకి తీసుకెళ్లే ఆయన మాయాజాలం మాములుది కాదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా థియేటర్స్ లో యావరేజ్ టాక్ పడిన. బుల్లితెర మీద హిట్ అయినా సినిమాలు చాలా ఉన్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఖలేజా సినిమా ప్లాప్ అయినా ఆ సినిమాని ప్రేక్షకులు ఇప్పటికి ఇష్టపడుతున్నారంటే త్రివిక్రమ్ రాసిన మాటలకి ప్రేక్షకుడు ఎంతగా కనెక్ట్ అయ్యాడో అనేది తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ తీసిన త్రివిక్రమ్ అదే పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి లాంటి ప్లాప్ కొట్టాడు. త్రివిక్రమ్ సినెమాలకు ఉండే వాల్యూ అజ్ఞాతవాసి తో పోయింది. కానీ ఎన్టీఆర్ కాంబోలో త్రివిక్రమ్ సినిమా అనేసరికి మల్లి త్రివిక్రమ్ కాలం మీద అందరి కన్ను పడింది. అయితే ఎన్టీఆర్ తో ఒక క్లాస్ మూవీ తీస్తాడనుకుంటే.. ఎన్టీఆర్ ట్రాక్ లోకొచ్చి మాస్ మూవీ చేసాడు. అయితే అరవింద సామెత - వీర రాఘవ సినిమా ఫ్యాక్షన్ అంటే రాయలసీమ బ్యాగ్డ్రస్ప్ లో తెరకెక్కిన సినిమా. అలంటి ఫ్యాక్షన్ బ్యాగ్డ్రాప్ కథలు కోకొల్లలుగా వచ్చేసాయి. కానీ త్రివిక్రమ్ బలమైన డైలాగ్స్ తో కథలో కొత్తదనముతో అరవింద ఉంటుందనుకున్నారు. యుద్ధం ఆపేవాడే మగాడు అనే థీమ్ చూపించాలంటే యుద్ధాన్నీ చూపించే తీరాలి కాబట్టి అక్కడ మాత్రం బోయపాటి దారిలో వెళ్ళిపోయాడు. ఇక్కడ అతని మార్క్ మిస్ అయ్యిందే అని ఫీల్ కావడం ప్రేక్షకుల తప్పు కాదు. ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్, పూజా హెగ్డేల మధ్య ట్రాక్ ను మొక్కుబడిగా రాసుకున్న త్రివిక్రమ్ అది ఎంటర్ టైనింగ్ గా రాసుకుని ఉంటే ఇది ఇంకో లెవెల్ లో ఉండేది. లవ్ స్టోరీ మొక్కుబడిగా అనిపిస్తుంది. కానీ సీమలో శాంతిని నెలకొలపాలి అంటే ముందు శత్రువుకు దగ్గరవ్వాలి అనే థీమ్ మీద సెకండ్ హాఫ్ మొత్తం నడిపించిన తీరు సినిమా పూర్తిగా పాడవకుండా కాపాడింది. అయితే డైలాగ్స్ లో తన మార్క్ సినిమా మొత్తం లేకపోయినా కీలకమైన సన్నివేశాల్లో మాత్రం త్రివిక్రమ్ రుచి చూపించాడు. త్రివిక్రమ్ పెన్ పవర్ అంతా ప్రీ ఇంటర్వెల్ నుంచి మొదలై క్లైమాక్స్ దాకా గ్రాఫ్ తగ్గకుండా మైంటైన్ చేస్తూ వచ్చింది. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబో మీదున్న అంచనాలు ఈ అరవింద సమేత అందుకుంటుందో లేదో అనేది కాస్త కన్ఫ్యూజన్ అయినప్పటికీ. ప్రస్తుతం ప్రేక్షకుడు ముందున్న ఏకైన ఆప్షన్ అరవింద సమేత కావడం సినిమాకి మంచి కలెక్షన్స్ తెస్తుంది అనడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు.

సాంకేతికవర్గం పనితీరు:
ఒకప్పుడు భారీ సినిమాలకు ఎడా పెడా వాయించేసి పేరు తెచ్చుకున్న థమన్ ఈ మధ్య బాగా స్లో అయ్యాడు. మల్లి చిన్న చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన థమన్ ఎన్టీఆర్ తో సినిమా అనేసరికి ఎగిరిగంతేసి మరీ..మంచి ట్యూన్స్ ఇస్తాడనుకుంటే. తన పాట ఫ్లేవర్ ని వదలలేదు. కాకపోతే పాత ట్యూన్స్ కొంత గుర్తుకు వచ్చినప్పటికీ మరీ నిరాశ పరిచే ఆల్బమ్ కాకపోవడం అరవింద సమేతకు ప్లస్ గా మారింది. కానీ వాటి కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు థమన్. ఎమోషనల్ సీన్స్ లో, యాక్షన్ సీన్స్ లో థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఇరగదీసాడు. అయితే సిగ్నేచర్ ట్యూన్ అంటూ ఏది ప్రత్యేకంగా లేకపోయినా ఇంటెన్సిటీని బాగా మైంటైన్ చేసాడు. అరవింద సమేత కి అసలైన ప్లస్ పాయింట్ పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ. కథ సీమకు మారక అక్కడి సహజమైన వాతావరణాన్ని కృత్రిమంగా వేసిన సెట్ లో తీసినా కళ్ళకు కట్టినట్టు డిజైన్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ కష్టాన్ని తన కెమెరాలో అద్భుతంగా చూపించాడు. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఓ పావు గంట కోత వేసుంటే ఇంకా క్రిస్పీగా వచ్చేది. హారికా అండ్ హాసిని బ్యానర్ మీద చినబాబు ఈ సినిమాకోసం బాగానే ఖర్చు పెట్టాడు. నిర్మాణ విలువలకు ఒంక పెట్టడానికి లేదు.

ప్లస్ పాయింట్స్: ఎన్టీఆర్ నటన, జగపతిబాబు విలనిజం, యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, సెటిల్మెంట్ సీన్, క్లైమాక్స్, సినిమాటోగ్రఫీ, ఫస్ట్ హాఫ్

నెగెటివ్ పాయింట్స్: నిడివి ఎక్కువవడం, ఫస్ట్ హాఫ్, రొటీన్ స్టోరీ, రొటీన్ ఫ్యాక్షన్ బ్యాగ్డ్రాప్, కామెడీ లేకపోవడం, నేపధ్య సంగీతం

మాగల్ఫ్.కామ్ రేటింగ్: 3.5/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com