తెలంగాణలో ఫైనల్ ఓటర్‌ లిస్ట్‌ ఖరారు..

- October 12, 2018 , by Maagulf
తెలంగాణలో ఫైనల్ ఓటర్‌ లిస్ట్‌ ఖరారు..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రెండు కోట్ల 73 లక్షల 18 వేల 603 ఓటర్లున్నారు. ఇందులో పురుషులు కోటీ 37 లక్షల 87 వేల 920 మంది ఉండగా… కోటీ 35 లక్షల 28 వేల 20 మంది మహిళలున్నారు. 2 వేల 663 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లుండగా.. సర్వీస్ ఓటర్ల సంఖ్య 9 వేల 451.

మరోవైపు హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. అసెంబ్లీ రద్దుపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. తొమ్మిది నెలల ముందే అసెంబ్లీ రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకురాలు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు, న్యాయవాది శశాంక్‌రెడ్డి హైకోర్టులో కొద్దిరోజుల కిందట వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని… ఎమ్మెల్యేలకు సైతం దీనిపై సమాచారం ఇవ్వలేదని డీకే అరుణ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది.

సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఆరు నెలల్లోపు ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉన్నందున తాము తెలంగాణలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎలక్షన్ కమిషన్ తరఫున న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఓటర్ల జాబితాను సైతం విడుదల చేశామని… ఏమైనా అభ్యంతరాలుంటే నామినేషన్ చివరి రోజు సాయంత్రం 3 గంటల వరకు తెలియజేసే అవకాశముందని కోర్టుకు వివరించారు. దీనికి స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. ఓటర్ల నమోదు ప్రక్రియను తామే పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది.

మరోవైపు ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై ఈనెల 31న విచారణ జరగనుంది. న్యాయస్థానంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్న శశిధర్‌రెడ్డి… ఓటర్ లిస్ట్‌లో అధికారులు తప్పులు చేశారని… వాటిని రుజువు చేస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com