పోస్టల్‌ ఒప్పందం నుంచి వైదొలగేందుకు సన్నాహాలు చేస్తున్న ట్రంప్

- October 18, 2018 , by Maagulf
పోస్టల్‌ ఒప్పందం నుంచి వైదొలగేందుకు సన్నాహాలు చేస్తున్న ట్రంప్

అమెరికా మరో కీలక ఒప్పందానికి మంగళం పాడనుంది. కీలకమైన పోస్టల్‌ ఒప్పందం నుంచి వైదొలగేందుకు సన్నాహాలు చేస్తోంది. అతి తక్కువ రవాణ ఖర్చుతో చైనా నుంచి సరుకులు అమెరికాకు వస్తున్నాయని ఆరోపిస్తోంది. పేద దేశాలను ఆదుకొనేందుకు తయారు చేసిన ఈ ఒప్పందం కింద అతితక్కువ అంతర్జాతీయ ఛార్జీలతో సరుకులను రవాణా చేసే విధంగా ఐక్యరాజ్యసమితి ఏర్పాట్లు చేసింది. ఈ రాయితీల కారణంగా తమ దేశ వ్యాపారులు నష్టపోతున్నారని అమెరికా వాపోతోంది. తమ నిర్ణయంతోనైనా ఛార్జీలను సవరిస్తారని అమెరికా అధికారులు అంటున్నారు. '' మేము మెరుగైన వ్యవస్థను కోరుకుంటున్నాము. చర్చల ద్వారా మేము దానిని సాధిస్తామని నమ్ముతున్నాము. '' అని అమెరికా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

అభివృద్ధి చెందుతున్న దేశం హోదాలో చైనా 1969లో ఈ ఒప్పందంలో చేరింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. దీంతో ఈ ఒప్పందంలో చైనా హోదా అభివృద్ధి చెందిన దేశంగా మారాల్సి ఉంది. కానీ తక్కువ ఛార్జిల కోసం చైనా తన హోదా మార్చుకోవడంలేదు. అమెరికా ఒత్తిడితో అయినా దీని నుంచి మార్చుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

అంతర్జాతీయ పోస్టల్‌ విభాగాన్ని యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌(యూపీయూ) పర్యవేక్షిస్తుంది. ఇదే సంస్థ ధరలను కూడా నిర్ణయిస్తుంది. ఈ సంస్థ ఐక్యరాజ్యసమితిలో ఓ భాగం. దీని కింద అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ధరలు, అభివృద్ధి చెందిన దేశాలకు ఎక్కువ ధరలను నిర్ణయించారు. దీనిని అడ్డం పెట్టుకొని చైనా అత్యధికంగా లబ్ధిపొందుతోంది. దీంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసి 2 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న పార్శిళ్లకు ఆయా దేశాలే పోస్టల్‌ ఛార్జిలు నిర్ణయించే విధంగా మార్చాలని కోరుతోంది. ఇటీవల 2 కిలోల కంటే తక్కువ బరువున్న పార్శిళ్ల సంఖ్య పెరగటంతో వివాదం మొదలైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com