శబరిమల ఆలయంలోకి అందరికీ ప్రవేశం: సీఎం

- October 19, 2018 , by Maagulf
శబరిమల ఆలయంలోకి అందరికీ ప్రవేశం: సీఎం

శబరిమలలో 3వ రోజు కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ మహిళల్ని అనుమతించేంది లేదని కొందరు భక్తులు, హిందూ సంఘాలు ఆందోళనలు చేస్తుండడంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులాగే ఉంది. ఇవాళ ఇద్దరు మహిళలు శబరిమల గుడి ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఐతే, వీరిని లోపలికి అనుమతించేది లేదని అయ్యప్పలు తెగేసి చెప్తున్నారు. వందల మంది పోలీసుల మోహరింపు, వీరికి పోటీగా భక్తుల ఆందోళనలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భక్తులు సహకరించాలని IG విజ్ఞప్తి చేశారు. ఐతే.. మహిళల్ని అనుమతించేది లేదంటూ అయ్యప్పలంతా ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలుపుతుండడంతో గందరగోళం నెలకొంది. మాలధారులంతా పెద్ద ఎత్తున భజన పాటలు పాడుతూ.. తమ నిరసన కొనసాగిస్తున్నారు. దీనిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం చివరికి వెనక్కు తగ్గింది. పోలీసులు, మహిళలు ఆలయం నుంచి వెనక్కు రావాలని కోరింది.

ప్రధాన ఆలయం పరిసారాలతోపాటు ముందుజాగ్రత్తగా నీలక్కల్ వద్ద కూడా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఐతే, కొండకు వచ్చే చాలా మంది భక్తులు సన్నిధానానికి మహిళలు వెళ్లడం సరికాదంటున్నారు. సంప్రదాయాలను గౌరవించాలని ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.

శబరిమల ఆలయంలోకి అందరికీ ప్రవేశం ఉంటుందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. మిగతా ఆలయాలతో పోలిస్తే ఈ క్షేత్రానికి ప్రత్యేకత ఉందన్నారు. ఐతే.. ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్‌లు దీన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. హింసకు దారి తీసేలా రెచ్చగొట్టే చర్యలు చేయడం అంటే.. కొన్ని వర్గాలను దేవుడికి దూరం చేయడమేనన్నారు. గతంలో ఆదివాసీలు శబరిమలలో నిర్వహించే ఆచారవ్యవహారాలు ఇప్పుడు అక్కడ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com