శబరిమల వివాదం..భక్తుల విజయం

- October 22, 2018 , by Maagulf
శబరిమల వివాదం..భక్తుల విజయం

ఢిల్లీ: అయ్యప్ప భక్తుల పోరాటం ఫలించింది. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలంటూ తాము గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఆలయం ప్రవేశం కల్పిస్తూ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం, ఎప్పటి నుంచి విచారణ జరపుతామన్న విషయాన్ని నేడు ప్రకటించనుంది. ''19 రివ్యూ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయం మాకు తెలుసు. విచారం తేదీని మంగళవారం నిర్ణయిస్తాం''అని ధర్మాసనం స్పష్టం చేసింది.

శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తీర్పు వెలువడిన నాటి నుంచి కేరళ అట్టుడికిపోతోంది. హిందూ సంస్థలు, అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అయ్యప్ప ఆలయం తెరువగా.. ఆలయంలోకి వెళ్లేందుకు కొందరు మహిళలు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. మహిళలను అయ్యప్ప భక్తులు, ఆందోళనకారులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటూ శబరిమల, పంబ, పథనంతిట్ట, ఎర్నాకులం, తిరువనంతపురం, కొచ్చి తదితర ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు కేరళ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పలువురు యువతులను ఆలయం వరకూ మాత్రమే చేర్చగలిగిన పోలీసులు, వారిని పద్దెనిమిది మెట్లను మాత్రం ఎక్కించలేకపోయారు. యువతులు ఆలయంలోకి రాకుండా అడ్డుకునే విషయంలో భక్తులు విజయం సాధించారు. ఆలయం తెరిచిన 5 రోజులు అక్కడ ఉద్రిక్త వాతావరణమే కనిపించింది. ఇప్పుడు రివ్యూ పిటిషన్ విషయంలోనూ సానుకూల ఫలితం వెలువడింది. మొత్తంగా సుప్రీంకోర్టు తన తీర్పుపై సమీక్షించేందుకు ఓకే చెప్పడం భక్తుల విజయమని శివసేన ప్రతినిధి తెలిపారు.

రాజ్యాంగ బెంచ్ ఇచ్చిన తీర్పుపై అత్యవసరంగా సమీక్షించాలంటూ న్యాయవాది జే నెడుంపర కోర్టును అభ్యర్థించారు. నేషనల్ అయ్యప్ప భక్తుల అసోసియేషన్ పక్షాన నెడుంపర రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌లను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని న్యాయవాది ఇంతకు ముందే కోర్టును అభ్యర్థించారు. ఇప్పటికిప్పుడు విచారణ చేపట్టలేమని ఈ నెల 9న బెంచ్ తేల్చి చెప్పింది.

కాగా, ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మహిళలు శబరిమల ఆలయ ప్రవేశంపై 4:1 నిష్పత్తిన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com