ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ప్రారంభం
- October 22, 2018
ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన మంగళవారం ప్రారంభమవుతోంది. ఈ అద్భుత నిర్మాణానికి తొమ్మిదేళ్ళు పట్టింది. ఈ వంతెన పొడవు 55 కిలోమీటర్లు. ఇది హాంకాంగ్ నుంచి మకావు మీదుగా చైనాలోని జుహాయి నగరానికి వెళ్తుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ వంతెన ప్రారంభోత్సవం కోసం మంగళవారం జుహాయికి చేరుకుంటారని భావిస్తున్నారు. ఈ వంతెన నిర్మాణానికి 2,000 కోట్ల డాలర్లు (దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు) ఖర్చయింది. అయితే, ఇది అవసరం లేని 'తెల్ల ఏనుగు' అని విమర్శకులు అంటున్నారు. భద్రత సమస్యల వల్ల ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఆలస్యం జరిగింది. ఈ పనుల్లో 18 మంది కార్మికులు చనిపోయారని అధికారులు చెప్పారు. బుధవారం నుంచి ఈ వంతెనను అధికారికంగా ప్రజలకు అంకితం చేస్తారు.
ఈ వంతెన ప్రత్యేకతలేమిటి?
ఈ బ్రిడ్జి దక్షిణ చైనాలోని మూడు తీర ప్రాంత నగరాలను - హాంకాంగ్, మకావు, జుహాయి - కలుపుతుంది. భూకంపాలు, తుపాన్లను తట్టుకునే విధంగా నిర్మించిన ఈ వంతెన కోసం 4 లక్షల టన్నుల ఉక్కును ఉపయోగించారు. ఈ మొత్తం ఉక్కుతో 60 ఐఫిల్ టవర్లను కట్టవచ్చు. ఈ వంతెనలో 30 కిలోమీటర్ల మార్గాన్ని పెరల్ రివర్ డెల్టా సముద్రం మీదే నిర్మించారు. ఇందులో 6.7 కిలోమీటర్ల రోడ్డు మధ్యలో సముద్ర గర్భంలో ఉంటుంది. రెండు కృత్రిమ దీవుల గుండా ఈ సొరంగ మార్గం వెళ్తుంది. ఇందులో ఇంకా లింకు రోడ్లు, జూహాయి, హాంకాంగ్ నగరాలను ప్రధాన వంతెనకు కలిపే భూతల సొరంగమార్గాలు కూడా ఉన్నాయి.
ఈ వంతెనను ఎందుకు నిర్మించారు?
దక్షిణ చైనాలో హాంకాంగ్, మకావు వంటి తొమ్మిది నగరాలను కలుపుతూ విశాల తీర ప్రాంతాన్ని సృష్టించాలనే ప్రణాళికలో భాగంగా ఈ బ్రిడ్జి రూపుదిద్దుకుంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం 6.8 కోట్ల మంది నివసిస్తున్నారు. గతంలో, జుహాయి - హాంకాంగ్ ల మధ్య ప్రయాణానికి నాలుగు గంటలు పట్టేది. ఇప్పుడు ఈ వంతెన మీద ఆ వ్యవధి 30 నిమిషాలకు తగ్గిపోయింది.
ఈ బ్రిడ్జి మీద ఎవరైనా వెళ్ళవచ్చా?
లేదు. కోటా విధానం ద్వారా అనుమతి పొందిన వారు మాత్రమే ఈ బ్రిడ్జి మీద ప్రయాణించాలి. అన్ని వాహనాలూ టోల్ సుంకం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రజారవాణా వ్యవస్థకు దీని మీద అనుమతి లేదు. ప్రైవేటు షటిల్ బస్సులు వెళ్ళవచ్చు. అయితే, దీనికి రైలు మార్గాలతో అనుసంధానం లేదు. రోజూ 9,200 వాహనాలు ఈ వంతెన మీద ప్రయాణిస్తాయన్నది అధికారుల ప్రాథమిక అంచనా. అయితే, ఈ ప్రాంతంలో కొత్త రహదారుల నిర్మాణం కూడా జరిగిన నేపథ్యంలో ఈ అంచనాను వారు తగ్గించారు.
ప్రజలు ఏమంటున్నారు?
ఈ ప్రాజెక్టు మీద విమర్శలు కూడా తీవ్రంగానే వినిపిస్తున్నాయి. ఇదొక 'మృత్యు వంతెన' అని కొన్ని స్థానిక పత్రికలు అభివర్ణించాయి. హాంకాంగ్ వైపు నుంచి కనీసం తొమ్మిది మంది, చైనా వైపు నుంచి మరో తొమ్మిది కార్మికులు చనిపోయారని అధికారులు బీబీసీ న్యూస్ చైనీస్‌తో చెప్పారు. వందల మంది కార్మికులు ఈ వంతెన నిర్మాణంలో గాయపడ్డారు. అంతేకాకుండా, పర్యావరణానికి కూడా ఈ నిర్మాణం హాని చేస్తుందనే ఆరోపణలున్నాయి. ఈ నిర్మాణం ఇప్పటికే సముద్ర జీవరాశికి ఎంతో హాని చేసిందని, ముఖ్యంగా అత్యంత అరుదైన తెల్ల డాల్ఫిన్లకు తీరని నష్టం కలిగించిందని పర్యావరణ పరిరక్షణ సంస్థలు ఆరోపిస్తున్నాయి. హాంకాంగ్ జలాల్లో డాల్ఫిన్ల సంఖ్య 148 నుంచి 48కి పడిపోయిందని, ఇది ఈ పదేళ్ళలో వచ్చిన మార్పు అని వరల్డ్ వైట్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్) హాంకాంగ్ శాఖ తెలిపింది. "ఈ ప్రాజెక్ట్ సముద్ర పర్యావరణానికి కోలుకోలేనంతటి నష్టం మిగిల్చింది" అని డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్ ఓషన్ కన్సర్వేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ సమంతా లీ అన్నారు.
పెట్టిన ఖర్చుకు ఫలితం ఉంటుందా?
చుట్టుపక్కల లింకు రోడ్లు, కృత్రిమ దీవులతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి అత్యధికంగా 2,000 కోట్ల డాలర్లు ఖర్చయింది. ఒక్క ప్రధాన వంతెన నిర్మాణానికే దాదాపు 700 కోట్ల డాలర్లు ఖర్చయింది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు 10 లక్షల కోట్ల యువాన్లను సమకూర్చుతుందని చైనా అధికారులు చెబుతున్నారు. కానీ, హాంకాంగ్ అధికారులు మాత్రం అంత ఉండదని అంటున్నారు. "కార్లు అధిక సంఖ్యలో ఆ వంతెనను ఉపయోగించకపోతే రాబడి ఎలా ఉంటుంది" అని తన్యా చాన్ బీబీసీ న్యూస్‌తో అన్నారు. నిర్మాణ వ్యయాన్ని రాబట్టడం సాధ్యమయ్యే పని కాదని కూడా చాన్ వివరించారు. బీబీసీ చైనీస్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ వంతెన టోల్ సుంకం రూపంలో ఏడాదికి 8.6 కోట్ల డాలర్లను మాత్రమే ఆర్జిస్తుంది. ఈ మొత్తంలో మూడో వంతు బ్రిడ్జి నిర్వహణ వ్యయం కిందే పోతుంది. విమర్శుకులు ఈ వంతెనను 'తెల్ల ఏనుగు'గా అభివర్ణిస్తున్నారు. రాబడి ఏమీ ఉండదని అంటున్నారు. ఇతరులు మాత్రం దీని ప్రధాన లక్ష్యం, హాంకాంగ్ - చైనా మధ్య భూభాగానికి మధ్య అనుసంధానానికి ప్రతీకగా కనిపించడమే అని అంటున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!