ఖషోగ్జీ హత్య పై టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్
- October 23, 2018
జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీ హత్యకు కొన్ని రోజుల ముందే ప్రణాళిక జరిగిందని టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ అన్నారు. పథకం ప్రకారం, అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో అత్యంత క్రూరంగా ఖషోగ్జీ హత్య జరిగినట్లు తమవద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఖషోగ్జీ శవం ఎక్కడుంది, ఎవరి ఆదేశాలతో ఈ హత్య జరిగింది అన్న ప్రశ్నలకు సౌదీ అరేబియా సమాధానం చెప్పాలని ఎర్డొగాన్ డిమాండ్ చేశారు. నిందితుల విచారణ ఇస్తాంబుల్‌లోనే జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు 18 మంది అనుమానితులను సౌదీ అరేబియాలో అరెస్టు చేసినట్లు టర్కీ అధికార పార్టీ ఎంపీల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఆ హత్య జరగడానికి కొన్ని గంటల ముందు సౌదీకి చెందిన 15 మంది మూడు బృందాలుగా వేరువేరు విమానాల్లో ఇస్తాంబుల్ చేరుకున్నారని ఎర్డొగాన్ చెప్పారు. టర్కీ అధికార పార్టీ ఎంపీల సమావేశంలో ఆ దేశ అధ్యక్షుడు ఎర్డొగాన్ మాట్లాడారు. హత్యకు ఒకరోజు ముందు ఆ బృందాల్లోని కొందరు బెల్గ్రాడ్ అటవీ ప్రాంతానికి వెళ్లారని ఆయన తెలిపారు. ఆ ప్రాంతంలోనే ఖషోగ్జీ శవాన్ని పడేసినట్లుగా అనుమానిస్తూ టర్కీ పోలీసులు గాలిస్తున్నారు.
వివాహానికి సంబంధించిన పత్రాల కోసం ఖషోగ్జీ వస్తున్నారన్న విషయం ముందే తెలుసుకున్న ఆ బృందం సౌదీ కాన్సులేట్ భవనంలోని సీసీ కెమెరాలను ఎలా తొలగించిందో కూడా ఎర్డొగాన్ వివరించారు. అరెస్టు చేసిన ఆ 18 మందిని ఇస్తాంబుల్‌లోనే విచారించాలని, ఖషోగ్జీ హత్యలో పాత్రధారులందరినీ కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఖషోగ్జీ హత్యకు సంబంధించి టర్కీ సేకరించిన ఎలాంటి ఆధారాలనూ ఆయన బయటకు విడుదల చేయలేదు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్