సౌదీతో తెగతెంపులపై 'నో' అంటున్న పశ్చిమ దేశాలు

- October 23, 2018 , by Maagulf
సౌదీతో తెగతెంపులపై 'నో' అంటున్న పశ్చిమ దేశాలు

రియాద్‌: జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్య విషయంలో సౌదీ అరేబియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ పశ్చిమ దేశాలు మాత్రం ఆ దేశంతో తెగతెంపులు చేసుకునే విషయంలో విముఖత ప్రదర్శిస్తున్నాయి. వాషింగ్టన్‌ పోస్ట్‌కు చెందిన కాలమిస్టు ఖసోగి ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సలేట్‌ను ఈ నెల 2న సందర్శించిన తరువాత అదృశ్యమయ్యాడు. ఆయనను సౌదీ అరేబియా హత్య చేసిందని టర్కీ ఆరోపిస్తుండగా సౌదీ అధికారులు దాదాపు రెండు వారాల పాటు వీటిని తోసిపుచ్చారు. ఎట్టకేలకు ఖషోగ్గీ తమ దౌత్య కార్యాలయంలోనే హత్యకు గురైన విషయాన్ని వారు అంగీకరించారు. 

సౌదీ విదేశాంగ మంత్రి అదల్‌ అల్‌ జుబెయిర్‌ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, ఖషోగ్గీ హత్య తమ దేశం చేసిన ఘోర తప్పిదమని అన్నారు. ఇందులో యువరాజు సల్మాన్‌ ప్రమేయం గురించి తనకు తెలియదని ఆయన చెప్పారు. ఈ హత్యను పశ్చిమ దేశాలలో ప్రధానమైన అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌లు ఖండించినప్పటికీ, చమురు సంపద పుష్కలంగా వున్న సౌదీతో తెగతెంపులు చేసుకునే విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ కేసు దర్యాప్తులో వున్నందున ఇప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోవటం మంచిది కాదని అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్‌ న్యూచిన్‌ వ్యాఖ్యానించారు. ఈ కేసులో సౌదీ వ్యవహరిస్తున్న తీరు తనను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు.

అయితే ఖషోగ్గీ హత్య వెనుక వాస్తవాలను వెలికి తీయాలని బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ డిమాండ్‌ చేస్తున్నప్పటికీ సౌదీతో సంబంధాల విషయంలో యధాతథ స్థితిని కొనసాగించాలని ఈ దేశాలు భావిస్తున్నాయి. అయితే జర్మనీ మాత్రం ఈ వివాదం నేపథ్యంలో సౌదీకి ఆయుధ విక్రయాలను రద్దు చేసింది. సౌదీతో సంబంధాలను తెగతెంపులు చేసుకోవటానికి తాము సిద్ధంగా లేమని బ్రిటన్‌కు చెందిన బ్రెగ్జిట్‌ వ్యవహారాల మంత్రి డొమ్నిక్‌ రాబ్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com