సీబీఐ ఇంఛార్జ్‌ డైరెక్టర్‌ గా తెలుగువ్యక్తి

- October 24, 2018 , by Maagulf
సీబీఐ ఇంఛార్జ్‌ డైరెక్టర్‌ గా తెలుగువ్యక్తి

సీబీఐ కొత్త ఇంఛార్జ్‌ డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వర్‌రావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ముడుపుల ఆరోపణలతో అలోక్‌వర్మను పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ఇంఛార్జి డైరెక్టర్‌గా మన్నెంను నియమించారు. అలోక్‌ వర్మ, రాకేశ్‌ ఆస్థానాలను సెలవులో వెళ్లాలని కేంద్రం కోరింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే నాగేశ్వర రావు రంగంలోకి దిగారు. సీబీఐ కేంద్ర కార్యాలయంలోని 10, 11 ఫ్లోర్లలో తనిఖీలు జరిపారు. ఆస్థానా, దేవేందర్ తో పాటు మరి కొందరి చాంబర్లలో సోదాలు నిర్వహించారు.

మన్నెం నాగేశ్వర్‌రావు 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ఆయన స్వస్థలం వరంగల్‌ జిల్లా మంగపేట మండలం బోర్‌ నరసాపురం. ఆయన తల్లిదండ్రులు శేషమ్మ, పిచ్చయ్య. మన్నెం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మంగపేటలో చదివారు. 8 నుంచి 10 తరగతులు తిమ్మంపేట జడ్పీ హైస్కూల్ లో పూర్తి చేశారు. ఇంటర్ విద్యను వరంగల్‌ ఏవీవీ జూనియర్ కాలేజీలో అభ్యసించారు. వరంగల్‌ దేశాయ్‌పేట CKM కాలేజీలో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశారు. PHD చేస్తున్న సమయంలోనే 1986 సివిల్స్ రాసి కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యారు. ఒడిషా కేడర్ కు ఎంపికైన ఆయన ఎక్కువ కాలం ఛత్తీస్ గఢ్‌ లోనే పనిచేశారు. ఓడిషా డీజీపీగా కూడా విధులు నిర్వహించారు. ఏడాదిన్నరగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న ఆయన్ను సీబీఐలో వివాదాల నేపథ్యంలో కేంద్రం ఇంఛార్జి డైరెక్టర్‌ గా నియమించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com