భారత రాజధానిలో అత్యంత కీలక పదవుల్లో తెలుగు ప్రముఖులు..

- October 28, 2018 , by Maagulf
భారత రాజధానిలో అత్యంత కీలక పదవుల్లో తెలుగు ప్రముఖులు..

హస్తినలో తెలుగుకీర్తి పతాకం రెపరెపలాడుతోంది. అత్యంత కీలకమైన వ్యవస్థలకు అధిపతులుగా ఉంటూ సత్తా చాటుతున్నారు. తాజాగా సిబిఐ డైరెక్టర్ గా మరో తెలుగు అధికారి బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులున్నారు. సీవీసీ ఛీఫ్ గా తెలుగువారున్నారు. అత్యున్నత రాజ్యాంగ రెండో పదవిలో వెంకయ్యనాయుడు కొలువుదీరారు.

రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు. అవినీతి అక్రమాలపై ఆరా తీసే అత్యున్నత వ్యవస్థ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా కేవీ చౌదరి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు. దర్యాప్తు సంస్థ సిబిఐ డైరెక్టర్ గా మన్నెం నాగేశ్వరరావు.

హస్తినలో అత్యంత కీలక పదవుల్లో ఉండి దేశానికి సేవ చేస్తున్న తెలుగు ప్రముఖులు.. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలోని కీలక వ్యవస్థలను నడిపిస్తున్నారు. హస్తినలో అరడజను మంది మన తెలుగునేల కీర్తి ప్రతిష్టలను అనుమడింపజేస్తున్నారు. అత్యుత్తమ సేవలు అందిస్తూ పాలనారంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు.

సిబిఐ డైరెక్టర్ గా తెలుగువారికి అవకాశం.. దశాబ్ధాల తర్వాత దక్కింది. విజయ రామారావు తర్వాత ఈ పదవిని అందుకున్న తెలుగు ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావు. సీబీఐ కొత్త డైరెక్టర్‌గా నియమితులైన మన్నెం నాగేశ్వర్‌రావు 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ఆయన స్వస్థలం వరంగల్‌ జిల్లా మంగపేట మండలం బోర్‌ నరసాపురం. ఆయన తల్లిదండ్రులు శేషమ్మ, పిచ్చయ్య. మన్నెం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మంగపేటలో చదివారు. 8 నుంచి 10 తరగతులు తిమ్మంపేట జడ్పీ హైస్కూల్ లో పూర్తి చేశారు. ఇంటర్ విద్యను వరంగల్‌ ఏవీవీ జూనియర్ కాలేజీలో అభ్యసించారు. వరంగల్‌ దేశాయ్‌పేట CKM కాలేజీలో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశారు. PHD చేస్తున్న సమయంలోనే సివిల్స్ రాసి కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యారు. ఒడిషా కేడర్ కు ఎంపికైన ఆయన ఎక్కువ కాలం ఛత్తీస్ గఢ్‌ లోనే పనిచేశారు. ఒడిషా డీజీపీగా కూడా విధులు నిర్వహించారు. ఏడాదిన్నరగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న ఆయన్ను సీబీఐలో వివాదాల నేపథ్యంలో కేంద్రం డైరెక్టర్‌ గా నియమించింది.

ఇక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా ఉన్న కేవీ చౌదరిది కృష్ణా జిల్లా మచిలీపట్నం. 1978 ఐఆర్ఎస్ బ్యాచ్ కు చెందిన కేవీ చౌదరి… ఆర్ధిక శాఖలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్స్ ఛైర్మన్ గా సేవలు అందించారు. అనంతరం 2015 జూన్ 10న సీవీసీగా కేంద్రం నియమించింది. అత్యంత కీలకమైన బాధ్యతలు ఇవి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో జరిగే అవినీతి అక్రమాలపై విచారణ జరిపే అత్యున్నత వ్యవస్థ ఇది.. దీనికి మన తెలుగు అధికారి నేతృత్వం వహించడం గర్వకారణమే.

సుప్రీంకోర్టులో కూడా న్యాయమూర్తులుగా ఇద్దరు తెలుగువారున్నారు.. గతంలో ముగ్గురు ఉండేవారు.. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పదవీవిరమణ చేయడంతో ప్రస్తుతం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావులు న్యాయమూర్తులుగా ఉన్నారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు హైకోర్టులో న్యాయమూర్తిగా చేయకుండానే బార్ కౌన్సిల్ నుంచి నేరుగా జడ్జిగా బాధ్యతలు తీసుకున్న అతికొద్ది మందిలో జస్టిస్ లావు ఒకరు. 2016 మే 13న ఆయన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన లావు నాగేశ్వరరావు జూన్ 8 1957లో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఇక జస్టిస్ ఎన్వీ రమణ కూడా ప్రస్తుతం సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. 2022 వరకూ సుప్రీం న్యాయమూర్తిగా ఉంటారు. భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యేందుకు అవకాశాలున్నాయి. కృష్ణా జిల్లా పొన్నవరంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1957 ఆగస్టు 27న జన్మించారు. సుప్రీం న్యాయమూర్తి బాధ్యతలు తీసుకోవడానికి ముందు ఏపీ, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.

ఇక రాజ్యాంగ అత్యున్నత పదవుల్లో రెండోది అయిన ఉపరాష్ట్రపతి పదవి మన తెలుగువారి ఠీవీ వెంకయ్యనాయుడుకు దక్కింది. కేంద్రమంత్రిగా ఉన్న ముప్పవరపు వెంకయ్యనాయకుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికై 2017 ఆగస్టు 11న బాధ్యతలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా చవటపాలెంలో 1949 జులై 1న జన్మించిన వెంకయ్యనాయకుడు జైఆంధ్రా ఉద్యమం నుంచి రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉన్నారు. జయప్రకాశ్ నారయణ్ పిలుపుతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి.. జనతా పార్టీ తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు. తర్వాత జనసంఘ్, బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా ఎన్నో కీర్తి శిఖరాలకు అందుకున్నారు. ప్రస్తుతం రాజ్యాంగ పదవిలో తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నారు.

సతీశ్‌ రెడ్డి ఇప్పుడు రక్షణ రంగంలో ఈ పేరు మార్మోగుతోంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ గా తెలుగువారు నియమితులయ్యారు. రక్షణ మంత్రి సలహాదారుగా వ్యవహరించిన పరిశోధకుడు.. 2018 ఆగస్టులో డిఆర్ డీఓలో ఛైర్మన్ అయ్యారు. నెల్లూరు జిల్లాకు చెందిన సతీష్ రెడ్డి.. మిస్సైల్ టెక్నాలజీ విభాగంతో ఎన్నో సేవలు అందించారు. అగ్నీ-5 క్షిపిణ రూపోందించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రపంచమంతా చూస్తున్న గర్వించదగ్గ సంస్త DRDOకు ఛైర్మన్ అయ్యారు.

ఇలా ఎందరో తెలుగు కీర్తిప్రతిష్టలను చాటుతున్నారు ఎందరో మహనీయులు. భరతమాత ముద్దుబిడ్డలుగా మన్ననలు అందుకుంటున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com