ఆస్తులను అమ్మినా.. బదిలీ చేసినా పన్ను భారం!
- December 20, 2015మూల ధన లాభాలు...! ఆదాయ పన్ను చట్టంలో కీలకమైన అంశమిది. స్థిర, చరాస్తుల్లో ఏ ఆస్తిని అమ్మినా... దానిపై వచ్చే లాభాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. కంటికి కనిపించేది.. కనిపించనిది, వెండి, బంగారం, పురాతన వస్తువులు, పెయింటింగ్స్, శిలా సంపద, కళా సంపదలాంటివన్నీ ఆస్తులకిందే పరిగణిస్తారు. ఇలాంటి ఆస్తులను అమ్మినప్పుడు వచ్చే లాభాన్ని ఆదాయంగా పరిగణించి దానిపై పన్ను వేస్తారు. వీటినే మూలధన లాభాలుగా (క్యాపిటల్ గెయిన్స్) వ్యవహరిస్తారు. ఇవి ఆస్తులు కాదు.. కొన్నింటిని ఆస్తులుగా పరిగణించరు. ఉదాహరణకు వ్యాపారంలోని స్టాక్, స్టోర్స్, సామాగ్రిలను ఆస్తులుగా పరిగణించరు. అలాగే ఫర్నిచర్, వాహనాలు, వ్యక్తిగత ఆభరణాలు (బంగారం కాదు), వ్యవసాయ భూమి, స్పెషల్ బేరర్ బాండ్లు (1991), గోల్డెన్ బాండ్లు, గోల్డ్ డిపాజిట్ బాండ్లను ఆస్తులుగా పరిగణించరు. బదిలీ చేసినా... కేవలం ఆస్తులను అమ్మితేనే కాదు... బదిలీ చేసినా పన్ను భారం ఏర్పడుతుంది. ఇక్కడ బదిలీ అంటే.. అమ్మకం, మార్పిడి హక్కులను వదులుకోవటం లేదా రద్దు చేసుకోవటం. ఏదైనా చట్టప్రకారం కంపల్సరీ అక్విజేషన్, కొన్ని సందర్భాల్లో మెచ్యూరిటీ, స్థిరాస్తిని ఇవ్వటం, హౌసింగ్ సొసైటీల్లోమెంబర్‌షిప్ బదిలీ ఇలా ఎన్నెన్నో.. కానీ కొన్ని సందర్భాల్లో బదిలీలపై పన్ను భారం ఉండదు. హిందూ ఉమ్మడి కుటుంబంలో విడిపోయినప్పుడు వచ్చిన ఆస్తి, బహుమతి, కంపెనీల్లో షేర్లు, డిబెంచర్ల బదిలీ... వీలునామా ద్వారా సంక్రమించిన ఆస్తుల బదిలీలపై పన్ను భారం ఏర్పడదు. పన్ను భారం విషయానికి వస్తే, ఆస్తి ఏ ఏడాదిలో బదిలీ అయితే అదే ఏడాది పన్ను భారం ఏర్పడుతుంది. ప్రకృతి వైపరీత్యాల్లో నష్టానికి వచ్చే ప్రతిఫలంపై కూడా పన్ను చెల్లించాల్సి వస్తుంది. కంపల్సరీ అక్విజేషన్ జరిగినప్పుడు, పరిహారం చేతికి వచ్చినప్పుడు పన్ను భారం ఏర్పడుతుంది. స్వల్ప వ్యవధిలో బదిలీ అయితే స్వల్ప కాలిక మూలధన లాభాలని, దీర్ఘకాలం అయితే దీర్ఘకాలిక మూలధన లాభాలని అంటారు. షేర్లు డిబెంచర్ల విషయంలో ఇన్వెస్ట్ చేసి 12 నెలలు దాటితే దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈక్విటీల్లో దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను భారం లేదు. ఇతర ఆస్తుల విషయంలో 36 నెలలు దాటితే దీర్ఘకాలిక లాభాలుగా పేర్కొంటారు. స్వల్ప కాలిక మూలధన లాభాలను ఇతరాదాయానికి కలుపుతారు. దీర్ఘకాలిక మూలధన లాభాలపై 20 శాతం పన్ను లెక్కిస్తారు. స్థిరాస్తిలో జాగ్రత్తలు స్థిరాస్తి క్రయవిక్రయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఆస్తి కొనుగోలుకు సంబంధించిన రాత ప్రతులుండాలి. ఆస్తిని ఎంతకు కొన్నారన్నది ఇక్కడ ముఖ్యం. అలాగే ఆ ఆస్తికి ఏమైనా పెద్ద రిపేర్లు చేయిస్తే వాటి కాగితాలను భద్రపరచుకోవాలి. విక్రయ ఒప్పంద పత్రంలో అమ్మకం విలువను తప్పకుండా పేర్కొనాలి. బ్లాక్ మనీ వ్యవహారాల జోలికి వెళ్లొద్దు. చాలామంది స్థిరాస్తి విషయాల్లో ఒప్పందంలో ఒక మొత్తం, బయట మరొక మొత్తం పేర్కొంటారు. మీరు చూపించిన విలువ తప్పని, దాన్ని రీ-వేల్యూయేషన్ చేయించే హక్కు అధికారులకు ఉంటుంది. కుటుంబ ఆర్థిక అవసరాల మేరకు ముందు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయండి. పెళ్లి వంటి అత్యవసర పరిస్థితుల సమయంలో ఇంటిని అమ్మినప్పుడు ముందుగా పన్ను భారం చెల్లించిన తర్వాతే పెళ్లి చేయడం బెటర్. ఆ తర్వాతే ట్యాక్స్ ప్లానింగ్ గురించి ఆలోచించండి. పన్ను భారం తగ్గించడానికి లేదా మినహాయింపులు పొందడానికి అనేక రాచమార్గాలున్నాయి. ఇందుకు వృత్తినిపుణుల సహాయం తీసుకుంటే చాలు. ఏడాదిలో ఏ ఇతరాదాయాలు లేకపోతే బేసిక్ లిమిట్ మేరకు క్యాపిటల్ గెయిన్స్‌లో మినహాయింపు ఉంటుంది. కాని ఇక్కడ అన్ని విషయాలకు రాతకోతలుండాలన్న విషయం మర్చిపోవద్దు. ఇలా లెక్కిస్తారు.. ఆస్తుల బదిలీ వల్ల వచ్చిన ప్రతిఫలంలోంచి ఆస్తి కొన్న విలువను తీసేస్తారు. ఆస్తి కొన్న విలువను గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం 'ఇండెక్సింగ్' చేస్తారు. ఇలా చేయడం వల్ల ద్రవ్యోల్బణం ఆధారంగా కొన్న విలువ పెరుగుతుంది. అంతే కాకుండా మధ్యలో ఆస్తి విలువను పెంచే పన్నులు చేస్తే ఆ వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. షేర్ల అమ్మకాల్లో ప్రతీ వ్యవహారం ఎస్‌టీటీకి గురవుతుంది. అలా అయితే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. - ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









