ట్రంప్‌కు హెచ్చరిక... పౌరసత్వ హక్కును రద్దు చేస్తే సహించం

- October 31, 2018 , by Maagulf
ట్రంప్‌కు హెచ్చరిక... పౌరసత్వ హక్కును రద్దు చేస్తే సహించం

వాషింగ్టన్‌ : తల్లిదండ్రులు ఏ జాతీయులైనా అమెరికా గడ్డపై జన్మించిన పిల్లలకు ఆ దేశ పౌరసత్వం లభించే హక్కును కాలరాస్తూ త్వరలో కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేస్తానన్న అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలపై పెద్దయెత్తున నిరసనాగ్రహాలు వ్యక్తమయ్యాయి. ట్రంప్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ పార్టీ నుండి సైతం విమర్శలు ఎదురయ్యాయి. వలసలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రకటనలు చేయడం ద్వారా ఈ నెల6 నజరగబోయే మధ్యంతర ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న సంకుచిత దృష్టితోనే ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికా గడ్డపై పుట్టే ప్రతి ఒక్కరికీ పౌరసత్వం కల్పించే రాజ్యాంగబద్ధమైన హక్కును ట్రంప్‌ కేవలం కార్యనిర్వాహక ఉత్తర్వులతో రద్దు చేయలేరని అమెరికన్‌ కాంగ్రెస్‌లోని దిగువ సభ స్పీకర్‌ పాల్‌ రియాన్‌ చెప్పారు. ట్రంప్‌ మాత్రం పౌరసత్వ హక్కు గురించి రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావన లేదని, కనుక దీనిని రద్దు చేసేందుకు కార్యనిర్వాహక ఉత్తర్వు చాలు అని వాదిస్తున్నారు.. కార్యనిర్వాహక ఉత్తరువ్వల ద్వారా ఇమ్మిగ్రేషన్‌ చట్టాలను మార్చడానికి ఒబామా ప్రయత్నించారని, కానీ దాన్ని తాము ఆనాడు అంగీకరించలేదని రియాన్‌ కెంటకీలోని స్థానిక రేడియో స్టేషన్‌లో చెప్పారు. ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం, తల్లిదండ్రులు ఏ జాతివారైనప్పటికీ అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆ దేశ పౌరసత్వం ఆటోమేటిక్‌గా కల్పించబడుతుంది. దీనికి తూట్లు పొడవాలని ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. ట్రంప్‌ ఏం చెప్పినప్పటికీ పౌరసత్వ రద్దు పై ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకోజాలరని, కాంగ్రెస్‌ అనుమతితోనే వ్యవహరించాల్సి వుంటుందని, దీనికి రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని పాల్‌ రియాన్‌ చెప్పారు. సెనెట్‌ జ్యుడీషియరీ కమిటీ చైర్మన్‌, రిపబ్లికన్‌ సెనెటర్‌ చుక్‌ గ్రాస్లే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

పిట్స్‌బర్గ్‌లో ట్రంప్‌కు నిరసనల సెగ 
11 మంది యూదులు ఊచకోతకు గురైన పిట్స్‌బర్గ్‌లోని సినాగాగ్‌ను సందర్శించేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన కుటుంబ సభ్యులకు నిరసనల సెగ తాకింది. కాల్పుల ఘటన చోటుచేసుకున్న ఆలయం వద్దకు ట్రంప్‌ రాకను నిరసిస్తూ వందలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి బిగ్గరగా నినదించారు.. ట్రంప్‌ పర్యటనపై అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పిట్స్‌బర్గ్‌ రావాలని ట్రంప్‌ భావిస్తున్నారని తెలిస్తే రావద్దని ముందే చెప్పి వుండేవారమని మేయర్‌ బిల్‌ పెడుటో వ్యాఖ్యానించారు. మృతుల అంత్యక్రియలు కూడా జరిగిపోతున్నాయని తెలిపారు. కాగా ఈ పర్యటనలో ట్రంప్‌ వెంట ఆయన భార్య మెలనికా ట్రంప్‌, కుమార్తె ఇవాంకా ట్రంప్‌, అల్లుడు కుష్నర్‌ వున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com