ఖషోగ్జీ హత్య కేసు: సౌదీ అరేబియా, అమెరికాలకు టేపులు ఇచ్చిన టర్కీ

- November 10, 2018 , by Maagulf
ఖషోగ్జీ హత్య కేసు: సౌదీ అరేబియా, అమెరికాలకు టేపులు ఇచ్చిన టర్కీ

జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్యకు సంబంధించిన రికార్డింగ్స్‌ను అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియాలకు షేర్ చేసినట్టు టర్కీ తెలిపింది. ఖషోగ్జీని ఎవరు హత్య చేశారో సౌదీ అరేబియాకు తెలుసని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ మరోసారి ఆరోపించారు. జర్నలిస్ట్ ఖషోగ్జీ సౌదీ పాలనను, ముఖ్యంగా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను విమర్శించేవారని భావిస్తున్నారు. అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ అరేబియా కాన్సులేట్‌లో ఆయన్ను హత్య చేశారు. ఖషోగ్జీని అక్కడ హత్య చేశారని అంగీకరించినా, దాని వెనుక రాజ కుటుంబం పాత్ర ఉందనే ఆరోపణలను సౌదీ అరేబియా తోసిపుచ్చింది.

అంతకు ముందు ఆ దేశం ఖషోగ్జీ తమ కాన్సులేట్‌ నుంచి సురక్షితంగా బయటకు వెళ్లారని చెప్పింది. శనివారం టీవీలో ప్రసంగించిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ "మేం రికార్డింగ్స్ సౌదీ అరేబియా, వాషింగ్టన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్‌కు ఇచ్చేశాం" అని చెప్పారు. "ఇక్కడ ఏం జరిగిందో ఆ సంభాషణలు వారు విన్నారు, వాళ్లకు అవి తెలుసు" అని ఆయన అన్నారు. అయితే తాము ఆ రికార్డింగ్స్ విన్నామని ఇప్పటివరకూ ఏ దేశమూ చెప్పలేదు.

బీబీసీ శనివారం బ్రిటన్ విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి ఈ వివరాలు కోరినపుడు, వారు దానిని ధ్రువీకరించకపోగా, టేపులు తమకు ఇచ్చారనే విషయాన్ని కూడా ఖండించలేదు. 
"దోషులను న్యాయ పరిధిలోకి తీసుకురావాలని" ఖషోగ్జీ పెళ్లి చేసుకోవాలనుకున్న హటీస్ చెంగిజ్ ప్రపంచ దేశాల నేతలను కోరారు.

ఖషోగ్జీ హత్య గురించి ఇప్పటివరకూ తెలిసింది ఏమిటి?
ఖషోగ్జీ ఎలా మృతి చెందారనేదానిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పారు. ఆయన తన పెళ్లికి సంబంధించిన పత్రాలు కోసం కాన్సులేట్ వెళ్లారు. హత్యకు ముందు ఖషోగ్జీని టార్చర్ చేసినట్టు నిరూపించే కొన్ని టేబులు టర్కీ దగ్గర ఉన్నాయని మొదట ఆ దేశ మీడియా తెలిపింది. అయితే, ఖషోగ్జీని కాన్సులేట్‌లోకి అడుగుపెట్టగానే గొంతు నులిమి హత్య చేశారని, ముందే సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారం ఆయన మృతదేహాన్ని కనిపించకుండా చేశారని వారం క్రితం టర్కీ చెప్పింది. ఖషోగ్జీ శవం దొరకలేదు, దానిని ముక్కలు చేసి యాసిడ్‌లో వేసి కరిగించేశారని టర్కీ అధికారులు చెబుతున్నారు.

సమాధానాలు మార్చి చెబుతున్న సౌదీ
ఖషోగ్జీకి ఏం జరిగింది అనే ప్రశ్నకు సౌదీ అరేబియా రకరకాల సమాధానాలు చెబుతూ వచ్చింది. ఆయన కనిపించకుండా పోయినపుడు సౌదీ అరేబియా మొదట ఖషోగ్జీ కాన్సులేట్‌ నుంచి ప్రాణాలతో వెళ్లారని చెప్పింది. తర్వాత ఆయన్ను హత్య చేశారని అంగీకరించింది. ఈ హత్యకు సంబంధించి తాము 18 మంది నిందితులను అరెస్ట్ చేశామని, వారిని విచారిస్తున్నట్లు సౌదీ అరేబియా చెప్పింది. నిందితులను తమకు అప్పగించాలని టర్కీ డిమాండ్ చేస్తోంది.

జమాల్ ఖషోగ్జీ ఎవరు?
జమాల్ ఖషోగ్జీ జర్నలిస్టు, రచయిత. ఆయన దశాబ్దాలపాటు సౌదీ అరేబియా రాజ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు. ప్రభుత్వ సలహాదారుగా కూడా వ్యవహరించారు. 
రాజ కుటుంబానికి దూరమైన తర్వాత ఆయన గత ఏడాది అమెరికా వెళ్లిపోయి అక్కడే ఉండిపోయారు. వాషింగ్టన్ పోస్ట్‌లో కాలమ్స్ రాస్తున్న ఖషోగ్జీ వాటిలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ విధానాలను విమర్శించేవారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com