తెలంగాణ లో సోనియా గాంధీ పర్యటన వివరాలు

- November 23, 2018 , by Maagulf
తెలంగాణ లో సోనియా గాంధీ పర్యటన వివరాలు

తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు సోనియా గాంధీ. మేడ్చల్‌లో జరిగే భారీ బహిరంగ సభలోపాల్గొననున్న సోనియా.. ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగున్నరేళ్లు అయ్యింది. ఈ సమయంలో ఒక్కసారి కూడా రాష్ట్రానికి రాలేదు సోనియా. ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో తొలిసారిగా తెలంగాణ గడ్డపై సోనియా గాంధీ అడుగు పెట్టబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె ఏం చెప్పబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. సోనియాతో పాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా మేడ్చల్‌ సభలో పాల్గొననున్నారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు సోనియా గాంధీ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత ఐదు నిమిషాలకే మరో విమానంలో రాహుల్‌ రానున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఎంపిక చేసిన 21 మంది ఏఐసీసీ, టీపీసీసీ నేతలతో సోనియా సమావేశమవుతారు. అనంతరం రోడ్డు మార్గంలో సాయంత్రం 6 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు.సభలో దాదాపు 45 నిమిషాల పాటు సోనియా ప్రసంగం ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా 20 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా 116 పేజీల కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నారు సోనియా.

మొత్తం మూడు గంటల్లోనే సోనియా, రాహుల్‌ రాష్ట్ర పర్యటన ముగియనుంది. సభ ముగిసిన వెంటనే రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం అవుతారు సోనియా, రాహుల్‌. వాస్తవానికి రెండు రోజుల్లో సోనియాతో మూడు సభల నిర్వహణకు టీ కాంగ్రెస్‌ ముందుగా ప్రణాళిక వేసింది. అయితే సోనియా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా దాన్ని ఒక్క సభకు మాత్రమే పరిమితం చేసింది. ఈ సభ ద్వారానే తమ సత్తా ఏంటో చాటి చెప్పాలని భావిస్తోంది టీ కాంగ్రెస్‌.

నోటిఫికేసన్‌ ఏర్పడ్డాక జరుగుతున్న తొలి భారీ బహిరంగ సభ కావడంతో టీ కాంగ్రెస్‌ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందు కోసం మేడ్చల్‌లో భారీ ఏర్పాట్లు చేసింది. సభ ప్రాంగణం మొత్తం 75 ఎకరాలు కాగా.. అందులో 25 ఎకరాల్లో సభ.. 50 ఎకరాల్లో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. 70 మంది నాయకులు కూర్చునేలా భారీ వేదికను రూపొందించారు. అంతేకాదు 119 మంది అభ్యర్థులకు ప్రత్యేకంగా మరో వేదికను ఏర్పాటు చేశారు. సభకు పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్‌ చేశారు టీపీసీసీ నేతలు. మేడ్చల్‌ చుట్టూ ఉన్న 40 నియోజక వర్గాల నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. ఒక్కోదాని నుంచే 50 వేల మంది తరలింపునకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు సోనియా సభ నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారిపై కాకుండా సర్వీసు రోడ్డుపై ప్రతినిధులు వచ్చేలా బారికేడ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 3 రూట్ల ద్వారా సభాస్థలికి ప్రజలు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు.

కూటమిని నేతలను కూడా సోనియా సభకు కాంగ్రెస్‌ ఆహ్వానించింది. దీంతో మేడ్చల్‌ సభకు మహాకూటమి పార్టీల నేతలు కూడా హాజరు కానున్నారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, టీటీడీపీ అధ్యక్షుడు రమణ, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఈ సభలో ఒకే వేదిక పంచుకోనున్నారు. గద్దర్‌నూ ఈ సభకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి సోనియా రాష్ట్రానికి వస్తుండటంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com