మహిళల టీ20 ప్రపంచకప్‌-2018 విజేతగా ఆస్ట్రేలియా

- November 25, 2018 , by Maagulf
మహిళల టీ20 ప్రపంచకప్‌-2018 విజేతగా ఆస్ట్రేలియా

అంటిగ్వా: వెస్టిండీస్‌ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌-2018 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో ఆసీస్‌ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి నాలుగో టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు ఆరుసార్లు ఈ టోర్నీ నిర్వహించగా అందులో నాలుగుసార్లు ఆస్ట్రేలియా(2010, 12, 14, 18) విజేతగా నిలవడం విశేషం. 2009లో ఇంగ్లాండ్‌, 2016లో వెస్టిండీస్‌ ఒకసారి టైటిల్‌ కైవసం చేసుకున్నాయి. 2020 మహిళల టీ20 ప్రపంచకప్‌ ఆస్ట్రేలియాలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ వ్యాట్‌(43; 37బంతుల్లో 5×4, 1×6), కెప్టెన్‌ నైట్‌(25; 28బంతుల్లో 1×4, 1×6) మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.

ఆసీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తుండటంతో 19.4ఓవర్లలోనే 105పరుగులకే ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆసీస్‌ బౌలర్లలో గార్డనర్‌ మూడు వికెట్లు, జార్జియా, మెగాన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆసీస్‌ పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఓపెనర్లు హేలీ(22; 20బంతుల్లో 4×4), మూనీ(14; 15బంతుల్లో 1×4) జట్టుకు శుభారంభం ఇచ్చారు.

తర్వాత వన్‌డౌన్‌ బ్యాటర్‌ గార్డినర్‌(33; 26బంతుల్లో 1×4, 3×6), కెప్టెన్‌ లానింగ్‌(28; 30బంతుల్లో 3×4) భారీ షాట్లతో అలరించడంతో లక్ష్యాన్ని ఆసీస్‌ 15.1ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తాజా విజయంతో ఆస్ట్రేలియా ఖాతాలో నాలుగో టైటిల్‌ వచ్చి చేరినట్లయింది. ఫ్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు ఆసీస్‌ ఓపెనర్‌ హేలీ దక్కించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com