అసహనం వ్యక్తం చేస్తున్న విమాన ప్రయాణికులు

- November 26, 2018 , by Maagulf
అసహనం వ్యక్తం చేస్తున్న విమాన ప్రయాణికులు

ఢిల్లీ:ఎయిర్‌పోర్టులో చెక్‌-ఇన్‌ల కోసం క్యూలైన్లలో నిలబడకుండా ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియ పూర్తిచేసుకునే సౌలభ్యం ఉంది. అయితే తాజాగా కొన్ని విమానయాన సంస్థలు ఈ వెబ్‌ చెక్‌-ఇన్‌లపై ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులపై భారం మోపుతున్నాయి. ఇండిగో, స్పైస్‌జెట్‌ లాంటి ఎయిర్‌లైన్లు అన్ని రకాల సీట్ల వెబ్‌ చెక్‌-ఇన్‌లపై ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం దీనిపై సమీక్ష చేపట్టనున్నట్లు తెలిపింది. 'సవరించిన విధానాల ప్రకారం.. అన్ని సీట్ల వెబ్‌ చెక్‌-ఇన్‌లపై ఛార్జీలు వసూలు చేస్తున్నాం. అయితే ఎయిర్‌పోర్టుల వద్ద చెక్‌-ఇన్‌ సౌలభ్యాన్ని మీరు ఉచితంగానే పొందవచ్చు. అందుబాటును బట్టి సీట్లను కేటాయిస్తాం' అని విమానయాన సంస్థ ఇండిగో ఆదివారం ట్వీట్‌ చేసింది. మరో ఎయిర్‌లైన్‌ స్పైస్‌జెట్‌ కూడా ఆన్‌లైన్‌ చెక్‌-ఇన్‌లపై ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపింది.

దీంతో ఎయిర్‌లైన్ల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన శాఖ స్పందించింది. విమానయాన సంస్థల తాజా నిర్ణయం నిబంధనల ప్రకారం ఉందో లేదో సమీక్షిస్తామని తెలిపింది.

ఒకవేళ నిబంధనల ప్రకారమే అయితే.. ధరల ఫ్రేమ్‌వర్క్‌ ప్రకారమే వసూలు చేస్తున్నారా లేదా అన్నదాన్ని కూడా పరిశీలిస్తామని పేర్కొంది. కాగా.. ఇండిగో, స్పైస్‌జెట్‌ మినహా ఇతర విమానయాన సంస్థలు ఈ సేవలపై ఛార్జీలు విధించాయా..

లేదా అన్నదానిపై స్పష్టత లేదు. సాధారణంగా విమానాల్లో టికెట్‌ బుక్‌ చేసుకుంటే ఎయిర్‌పోర్టుకు వెళ్లి చెక్‌-ఇన్‌ చేసుకోవాలి. అక్కడ వారు టికెట్‌ వివరాలను సరిచూసి బోర్డింగ్‌ పాస్‌ ఇస్తారు. అయితే ఆన్‌లైన్‌ ద్వారా చెక్-ఇన్‌ ప్రక్రియ పూర్తిచేస్తే ఎయిర్‌పోర్టులో క్యూలైన్‌లో నిల్చునే పని ఉండదు.

ఇంటి వద్దే చెక్‌-ఇన్‌ చేసుకుని బోర్డింగ్‌ పాస్‌ను ప్రింట్‌ తీసుకుంటే సరిపోతుంది. దీంతో సమయం వృథా కాకుండా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కొన్ని ప్రత్యేక సీట్లు మినహా మిగతా వాటికి ఈ వెబ్‌ చెక్-ఇన్‌ సేవలను ఎయిర్‌లైన్లు ఉచితంగానే అందిస్తున్నాయి. తాజాగా ఇండిగో, స్పైస్‌జెట్‌ మాత్రం వీటిపై ఛార్జీలు విధించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com