బాలసాయిబాబా కన్నుమూత

- November 27, 2018 , by Maagulf
బాలసాయిబాబా కన్నుమూత

హైదరాబాద్: కర్నూలు జిల్లాకు చెందిన ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా(59) గుండెపోటుతో మృతి చెందారు. బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. సోమవారం అర్ధరాత్రి దోమలగూడలోని ఆశ్రయంలో గుండెపోటు రావడంతో బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్సపొందుతూ ఆయన కన్నుమూశారు. బాలసాయిబాబా 18 సంవత్సరాల వయసులోనే తొలిసారి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. కడుపులోంచి శివలింగం తీసే విద్య ద్వారా బాలసాయిబాబా ప్రాచుర్యం పొందారు.

1960 జనవరి 14న కర్నూలులో బాలసాయి జన్మించారు. ఆయన అసలు పేరు బాలరాజు 10వ తరగతి వరకు చదువుకున్న బాలసాయిబాబాకు కళలంటే ఆసక్తి ఎక్కువగా ఉండేది. కళల మీద ఆసక్తితో కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన ఆ తరువాత బాలసాయిబాబాగా అవతారం ఎత్తారు. సంక్రాంతి నాడు బాలసాయిబాబా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటారు. బాలసాయిపై భూకబ్జా ఆరోపణలు, పలు కేసులు కూడా ఉన్నారు.

శివరాత్రి నాడు బాలసాయిబాబా తన గొంతులో నుంచి ఒక శివలింగాన్ని బయటకు తీసేవారు. దీంతో అంతటా ఆయన ప్రాచుర్యం పొందారు. అయితే ఇదంతా మాయ అని జనవిజ్ఞాన వేదిక నేతలు, హేతువాదులు అభిప్రాయపడేవారు. అంతా కనికట్టే అనేవారు. ఆ వాదనను బాలసాయిబాబా భక్తులు కొట్టిపడేసేవారు. తాము దైవంలా భావించే బాలసాయిబాబాకు మహిమలు ఉన్నాయని నమ్మేవారు. బాలసాయిబాబా కర్నూలులో తక్కువగానే ఉండేవారు. హైదరాబాద్‌లోనే ఆశ్రమం ఉంది. ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉండేవారు. తరచూ విదేశాల్లో పర్యటించేవారు. దేశవిదేశాల్లో ఆయనకు శిష్యులు, భక్తులు ఉన్నారు. పలు దేశాలకు చెందిన భక్తులు కర్నూలు, హైదరాబాద్ ఆశ్రమాలకు వచ్చి బాలసాయిబాబాను దర్శించుకునేవారు. ఆయన చెప్పే బోధనలు వినేవారు. తుంగభద్ర ఒడ్డున బాలసాయి సెంట్రల్‌ సేవా నిలయం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com