ఢిల్లీ, చెన్నైలో.. భారీగా హవాల డబ్బు స్వాధీనం

- December 03, 2018 , by Maagulf
ఢిల్లీ, చెన్నైలో.. భారీగా హవాల డబ్బు స్వాధీనం

ఢిల్లీలో భారీ హవాలా రాకెట్‌ను చేధించింది ఐటీ శాఖ. లాకర్లలో దాచిన 25 కోట్ల రూపాయలను బయటికి తీసింది. ఈ సొమ్మంతా హవాలా సొమ్ముగా ఐటీ అధికారులు భావిస్తున్నారు. ఓప్రైవేట్ సంస్థలో పెద్ద మొత్తంలో హవాలా సొమ్ము ఉందనే పక్కా సమాచారంతో రంగంలో దిగారు ఐటీ అధికారులు. చాందినీ చౌక్ సహా 8 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించగా.. ఈ డబ్బును గుర్తించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలకు చెందిన పొగాకు, రసాయనిక, డ్రైఫూట్ డీలర్లు పన్ను ఎగవేత ద్వారా ఆ డబ్బును దాచుకొని ఉంటారని సమాచారం.

ఢిల్లీలో ఇంత పెద్ద స్థాయిలో డబ్బు దొరకడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. జనవరిలో ఐటీ శాఖ జరిపిన దాడుల్లో 40 కోట్ల సొమ్ము బయటపడింది. మరో సందర్భంలో ఈడీ దాడుల్లో 700 కోట్లు బయటపడింది. దుబాయ్‌ హవాలా ఆపరేటర్ పంకజ్ కపూర్‌కు ఈ హవాలా సొమ్ముతో సంబంధమున్నట్లు వెలుగుచూసింది.

అటు.. చెన్నైలోనూ 11కోట్ల నగదు, 7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓ పారిశ్రామికవేత్త కు చెందిన హోటల్లో విదేశీ వ్యక్తుల నుంచి హవాలా సొమ్మును తీసుకుంటున్నట్లు రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో DRI పోలీసులు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. సెంట్రల్ చెన్నైలోని హోటల్‌లో సోదాలు నిర్వహించి 7 కిలోల బంగారం, 11 కోట్ల రూపాయల హవాలా డబ్బు సీజ్ చేశారు.

హవాలా సొమ్ము కోసం ఓ వ్యక్తిని అదుపులో తీసుకున్న పోలీసులు.. అతని బ్యాగ్‌లో కిలో బరువున్న ఆరు బంగారు బిస్కెట్లు గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి విచారించగా, ఆ హోటల్లో బసచేసి ఉన్న విదేశీయుల నుంచి బంగారు బిస్కెట్లు తీసుకున్నట్లు అంగీకరించాడు. అతనిచ్చిన సమచారంతో.. మొత్తం ఐదుగురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com