నిరసనలతో భగ్గుమన్న పారిస్‌

- December 03, 2018 , by Maagulf
నిరసనలతో భగ్గుమన్న పారిస్‌

పారిస్‌: ఇంధన ధరల పెంపుపై భగ్గుమన్న ఫ్రాన్స్‌లో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని విధించాలని మాక్రాన్‌ ప్రభుత్వం యోచిస్తోంది. ధరల పెంపునకు నిరసనగా 'యెల్లో వెస్ట్స్‌' ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలపైైె ప్రభుత్వం నిర్బంధకాండ ప్రయోగించడంతో పారిస్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. రోడ్లపై కార్లను, భవనాలను తగులబెట్టడం, అద్దాలు పగులగొట్టడం, కిటికీలు ధ్వంసం చేయడం, దుకాణాలను యథేచ్ఛగా లూటీ చేయడం, పోలీసులకు నిరసనకారులకు మధ్య ఎక్కడికక్కడ ఘర్షణలతో పారిస్‌ నగరం అట్టుడుకుతోంది. ఇంతటి భయానకమైన పరిస్థితి పారిస్‌లో చోటుచేసుకోవడం 1968 తరువాత ఇదే ప్రథమం అని అధికారులు పేర్కొంటున్నారు. పారిస్‌లో మొదలైన ఈ అల్లర్లు ఫ్రాన్స్‌ అంతటికీ వ్యాపించాయి. ఈశాన్య ఫ్రాన్స్‌లోని చార్లెవిల్లీ దగ్గర నుంచి పశ్చిమాన ఉన్న నాంటెస్‌, దక్షిణాదిన ఉన్న మార్సెల్లీ వరకు ఇవి పాకాయి. పద్దెనిమిది మాసాల మాక్రాన్‌ ప్రభుత్వం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రజల్లో ఇంత పెద్దయెత్తున తిరుగుబాటు రావడానికి మాక్రాన్‌ ఇంధన పన్ను పెంపు ఒక ముఖ్య కారణం. గత నాలుగు దశాబ్దాల నయా ఉదారవాద ఆర్థిక విధానాలపై ఫ్రెంచ్‌ ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో రగులుతున్నారు. ఈ ఆర్థిక సంస్కరణలు సంపన్నులకు, బడా వ్యాపారుల ప్రయోజనాల కోసం తెచ్చినవేనని మెజార్టీ ఫ్రెంచ్‌ ప్రజలు భావిస్తున్నారు. ప్రజల్లో అసంతృప్తి రగుల్కొంటున్న తరుణంలో మాక్రాన్‌ పెట్రో మంట పెట్టారు. దక్షిన ఫ్రాన్స్‌లోని ఆర్లేస్‌ సమీపంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య ఘర్షణలో ఒక ఆందోళనకారుడు చనిపోయాడన్న వార్త సోషల్‌ మీడియా ద్వారా దావానలంలా వ్యాపించడంతో శనివారం నాడు ఒక్కసారిగా హింస చెలరేగింది. గత వారం యెల్లో వెస్ట్‌ చేపట్టిన నిరసనలో లక్షమంది దాకా పాల్గొంటే ఈ వారానికి వచ్చేసరికి అది 3లక్షలకు దాటిపోయింది. పరిస్థితిని అదుపు చేసేందుకు ఎమర్జెన్సీ విధించే అంశాన్ని మాక్రాన్‌ పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి బెంజమిన్‌ గ్రీవాక్స్‌ చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇంథన ధరల పెంపుతో బతుకు దుర్భరమైందని యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'యెల్లో వెస్ట్‌' ఉద్యమం పేరుతో గత రెండు వారాలుగా కొనసాగుతున్న ఈ ఆందోళనలు అంతకంతకూ ఉగ్ర రూపం దాల్చుతుండడంతో కలవరం చెందుతున్న అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ ఆదివారంనాడు ప్రధాని, హోం మంత్రులను, రక్షణ ఉన్నతాధికారులను పిలిపించుకుని అత్యవసర భేటీ నిర్వహించారు. యువత తమ ఆందోళన లను విరమించి ప్రభుత్వంతో చర్చలకు రావాలని ప్రభుత్వ ప్రతినిధి విజ్ఞప్తి చేశారు. అల్లర్లను కట్టడి చేసేందుకు ఎమర్జెన్సీ విధిస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన బదులిస్తూ పరిస్థితిని అదుపు చేసేందుకు పరిశీలిస్తున్న అంశాలలో ఇది కూడా వుందన్నారు. 
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గత నెల 17 నుండి ప్రారంభమైన ఆందోళనలు సోషల్‌ మీడియా విస్తృత ప్రచారంతో దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించటంతో పాటు షాపింగ్‌ మాల్స్‌, ఫ్యాక్టరీలు, ఇంథన చమురు డిపోలను దిగ్బంధించారు. కొన్ని అసాంఘిక శక్తులు యెల్లో వెస్ట్‌ ఉద్యమంలో ప్రవేశించి హింసను రెచ్చగొడుతున్నాయని ఫ్రాన్స్‌ హోం మంత్రి క్రిస్టోఫ్‌ కాస్టనర్‌ చెప్పారు. హింసాకాండను రెచ్చగొడుతున్న అనేక మందిని ఇప్పటికే అరెస్ట్‌ చేశామని ఆయన వివరించారు. చమురు దిగుమ తులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అనుసరిస్తున్న విధానాలు ప్రభుత్వం ముందుగా ప్రకటించి తప్పు చేసిందని, దీంతో ఇంథన రేట్లు పెరిగాయని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com