ఇండియా:ఒలింపిక్స్‌ చరిత్రలో తొలిసారి...

- December 03, 2018 , by Maagulf
ఇండియా:ఒలింపిక్స్‌ చరిత్రలో తొలిసారి...

న్యూ ఢిల్లీ:ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒలింపిక్స్‌ను 2032లో భారత్‌లో నిర్వహించేందుకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ఆసక్తిని తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వ మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది భారత్‌లో పర్యటించిన అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓఏ) అధినేత థామస్‌ బాచ్‌తో 2,032లో బిడ్‌ వేసేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్టు ఐఓఏ అధ్యక్షుడు నరిందర్‌ బాత్రా చెప్పారు. ఈ నిర్ణయాన్ని బాచ్‌ స్వాగతించారు. ఐఓఏ ఇప్పటికే ఐఓసీలో బిడ్‌పై ఆసక్తిని తెలియజేసింది. ముగ్గురు సభ్యుల ఐఓసీ బిడ్‌ కమిటీతో ఐఓఏ సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా జపాన్‌లో ఇంతకు ముందే సమావేశమయ్యారు.

'మేం 2,032 ఒలింపిక్స్‌పై చాలా సీరియస్‌గా ఉన్నాం. ఆసక్తి ఉందని ఐఓసీకి లేఖ సమర్పించాం. బిడ్ కమిటీతో సమావేశమయ్యాం. భారత్‌ అంతకన్నా ముందే ఒలింపిక్స్‌ నిర్వహించాల్సిదని సభ్యులు అన్నారు. తొలి దశలో నిర్వాహక దేశం బిడ్‌పై ఆసక్తిని తెలియజేస్తుంది. రెండో దశలో ఆతిథ్య నగరం/నగరాల పేర్లను బిడ్‌లో పేర్కొంటారు' అని మెహతా వెల్లడించారు.

భారత ఒలింపిక్స్‌ సంఘం చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఒలింపిక్స్‌ నిర్వహణ బిడ్‌పై ఆసక్తి తెలియజేయలేదు. 2,032 బిడ్‌ ప్రక్రియ 2,022లో ఆరంభమవుతుంది. 2,025లో ఆతిథ్య నగరాన్ని ప్రకటిస్తారు. ఈ మధ్యే ఆసియా క్రీడలను నిర్వహించిన ఇండోనేషియా ఇప్పటికే తన ఆసక్తిని తెలిపింది. చైనా,ఆస్ట్రేలియా, జర్మనీ, ఉత్తర దక్షిణ కొరియాలు బిడ్‌పై ఆసక్తిగా ఉన్నట్టు పేర్కొంటున్నాయి. 'సాధారణ సర్వసభ్య సమావేశంలో తీర్మానం ఆమోదించాక మా ప్రతిపాదనకు మద్దతివ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరబోతున్నాం. 2,022లో బిడ్‌ ప్రక్రియ మొదలవుతుంది. అంతకుముందే ప్రభుత్వ మద్దతు కూడగట్టాలి. ఒలింపిక్స్‌ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, అధికార, ప్రతిపక్ష నేతల మద్దతు లేఖలు అవసరం' అని మెహతా పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com