రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ హైదరాబాద్ పర్యటన ఖరార్

- December 18, 2018 , by Maagulf
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ హైదరాబాద్ పర్యటన ఖరార్

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. నాలుగు రోజులపాటు ఆయన నగరంలోనే బస చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. శీతాకాల విడిది కోసం వస్తున్న రాష్ట్రపతి పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు.


 
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ రానున్నారు. ఈ నెల 21న హైదరాబాద్‌కు రానున్న కోవింద్‌.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 24వరకు బస చేయనున్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్‌ సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి సమన్వయంతో పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.

ఈ నెల 21న సాయంత్రం 5గంటలకు రాష్ట్రపతి హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికిబయల్దేరి వెళ్తారు. పర్యటనకు సంబంధించి తగిన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు, నిరంతర విద్యుత్ సరఫరా, రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్యం, స్వాగత తోరణాలు, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ తదితర ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో సీసీటీవీలు, వైద్య బృందాలు, టెలిఫోన్, పత్రికలు అందుబాటులో ఉంచాలని సూచించారు. కరీంనగర్‌లో ఈ నెల 22న జరిగే ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. 23న రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం నిర్వహించి 24వ తేదీన తిరిగి రామ్‌నాథ్‌ కోవింద్ ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com