ఏపీ కేబినేట్‌ భేటీ..సమావేశంలో పలు కీలక నిర్ణయాలు.!

- December 21, 2018 , by Maagulf
ఏపీ కేబినేట్‌ భేటీ..సమావేశంలో పలు కీలక నిర్ణయాలు.!

ఇవాళ ఏపీ కేబినేట్‌ భేటీ కానుంది. మధ్యాహ్నాం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్‌ భేటీలో పెథాయ్ తుఫాన్ ప్రభావం, బాధితులకు నష్ట పరిహారంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు సీఎం చంద్రబాబు. అంతే కాదు తెలంగాణా స‌హా 5 రాష్ట్రాల ఎన్నిక‌ల అనంతరం జరుగుతున్న తొలి మంత్రి వ‌ర్గ స‌మావేశం కావటంతో రాజ‌కీయ అంశాల‌పై కూడా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం కూడా ఉంది.
 
పెథాయ్ తుఫాన్‌తో ఆంధ్రప్రదేశ్‌లో 60 వేల ఎక‌రాల్లో పంట‌ నీటిపాలైంది. దాదాపు 243 కోట్ల మేర న‌ష్టం వాటిల్లిన‌ట్టు ప్రభుత్వానికి ప్రాథమికంగా స‌మాచారం అందింది. ఈ నేపథ్యంలో పంట కోల్పోయిన రైతులకు ఇచ్చే నష్టపరిహారాన్ని కేబినెట్‌ సమావేశంలో ఖరారు చేయనున్నారు. నేరుగా బాధితులకే చెక్కులు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు వరుస తుఫాన్లు వచ్చిన కేంద్రం సహాయ నిరాకరణ చేయడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై కూడా ఈ భేటీలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

ఇక గ‌త నాలుగున్నర ఏళ్లలో అమ‌లు చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలు, నీటి పారుద‌ల ప్రాజెక్ట్‌లు వంటి 9 కీల‌క అంశాల‌పై శ్వేతపత్రాల విడుదలపై కేబినెట్‌ భేటీలో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ శాఖల అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. వీటిపై మంత్రులు డిస్కస్ చేయనున్నారు. వ‌చ్చే ఐదేళ్లలో ఏలాంటి ల‌క్ష్యాల‌తో ప‌ని చేయాలో చంద్రబాబు ప్రకటించనున్నారు.

మరోవైపు సార్వత్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో.. ప‌లు ప్రాధాన్యత అంశాల‌పై మంత్రులు ఫోక‌స్ పెట్టనున్నారు. ఈ నెలలో జరగబోయే క‌డ‌ప‌లో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాప‌న అంశంతో పాటు…రాజ‌ధానిలో స‌చివాల‌య భ‌వ‌నాలు, ప‌లు సంస్థల‌కు భూకేటాయింపు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు త్వరగా న్యాయం చేసేందుకు ఉన్న మార్గాలపై ఈ సమావేశంలో సమీక్షిస్తారు. ఎన్నికలు దగ్గర పడడంతో సంక్షేమ పథకాలను పరుగులు పెట్టించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా నేటి కేబినేట్‌లో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకునే అకాశం కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com