వరుస రాజకీయ హత్యలతో సతమతమవుతున్న ఇమ్రాన్ ఖాన్

- December 27, 2018 , by Maagulf
వరుస రాజకీయ హత్యలతో సతమతమవుతున్న ఇమ్రాన్ ఖాన్

కరాచీ: వరుస హత్యలతో కరాచీ బెంబేలెత్తుతోంది. రాజకీయనాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. వారం రోజుల్లో ముగ్గురిని మట్టుబెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. రెండు రోజుల క్రితం పాక్ సర్జమీన్ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మర్చిపోకముందే తాజాగా మరో హత్య జరిగింది. ముతాహిదా ఖ్వామి మూవ్‌మెంట్ నాయకుడు అలీ రాజా అబిదీని తీవ్రవాదులు దారుణంగా హత్య చేశారు. తన ఇంటి బయట కారులో ఉండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు అతనిపై గుళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో అలీ అక్కడికక్కడే చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జరగుతున్నవి రాజకీయ హత్యలా.. వ్యక్తిగతమా.. టెర్రర్ దాడులా అన్నది అంతుబట్టకుండా ఉంది. మరోవైపు వరుస హత్యలపై పాక్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. నిఘా వర్గాలను అప్రమత్తం చేసింది. హంతకులను పట్టుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ప్రకటించింది.

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్.. టెర్రర్ దాడులను అరికట్టేందుకు చేపడుతున్న కార్యక్రమాలు పెద్దగా సత్ఫలితాలనివ్వడం లేదు. పెట్టుబడులను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజా రాజకీయ హత్యలు ప్రభుత్వాన్ని మరింత ఇబ్బందిపెడుతున్నాయి. ఒకపక్క టెర్రర్ దాడులు.. మరోపక్క హత్యలతో.. శాంతిభద్రతల సమస్య ఇమ్రాన్ సర్కార్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com