కుంభమేళాకు రమ్మని కేటీఆర్ కు ఆహ్వానం

- December 29, 2018 , by Maagulf
కుంభమేళాకు రమ్మని కేటీఆర్ కు ఆహ్వానం

హైదరాబాద్ : జనవరి 15 నుంచి మార్చి 14 వరకు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళాకు రావల్సిందిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆహ్వానం అందింది. ఉత్తరప్రదేశ్ మౌలికవసతుల, పారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రి సతీశ్ మహానా శనివారం హైదరాబాద్ లో కేటీఆర్ ను కలిసి కుంభమేళా జ్ఞాపికను అందించి ఆహ్వానించారు. 

ఉత్తరప్రదేశ్ లోని (అలహాబాద్)ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళాకు ప్రపంచం నలుమూలలనుంచి భక్తులు హజరై గంగాస్నానం చేస్తారు. జనవరి 2007లో ప్రయాగలో జరిగిన అర్ధ కుంభ మేళాకి 17 మిలియన్ లకు పైగా హిందువులు హాజరవగా అన్నింటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి 15 ఒక్క రోజే 5 మిలియన్ లకు పైగా ప్రజలు హాజరై పుణ్య స్నానాలు చేశారు. 2001లో జరిగిన మహా కుంభ మేళాకు దాదాపు 60 మిలియన్ లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం.

2019 జనవరి 15 నుంచి దాదాపు 60 రోజుల పాటు జరిగే మహా కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తోంది. ఇప్పటికే భక్తులు బస చేసేందుకు ఫంక్షన్‌ హాళ్లను, కళ్యాణ మండపాలను రిజర్వు చేసి ఉంచింది. జనవరి నుంచి మార్చి వరకు మూడునెలల పాటు పెళ్లిళ్లు తదితర సామూహిక కార్యక్రమాలను జరుపుకోవద్దని వాటిని వాయిదా వేసుకోవాలని ఆదేశించింది.

కుంభమేళాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా పోలీసులను ఎంపికచేసి నియమిస్తోంది. ఇక్కడ విధులు నిర్వర్తించేందుకు మంచి ప్రవర్తన గల పోలీసులను గుర్తించి వారినే కుంభమేళా విధుల్లో నియమించాలని నిర్ణయించారు. కేంద్ర పారామిలటరీ దళాలతోపాటు పదివేల మంది పోలీసులను కూడా బందోబస్తు కోసం నియమించనున్నారు.''మద్యం తాగని, ధూమపానం చేయని శాఖాహారులై ఉండి, మృదువుగా మాట్లాడే ఉత్సాహవంతులైన యువతీ, యువకులు కావలెను.'' అంటూ ప్రకటన ఇచ్చి కొత్తగా పోలీసులను రిక్రూట్ చేసుకుంది. మద్యం తాగని, ధూమపానం చేయని సత్ ప్రవర్తన గల పోలీసులను ఎంపిక చేసి కుంభమేళా విధులు నిర్వర్తించేందుకు పంపించాలని కోరుతూ తాము బరేలీ, బడౌన్, షాజహాన్పూర్, ఫిలిబిత్ జిల్లాల ఎస్పీలకు లేఖలు రాశామని అలహాబాద్ పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com