మనకు ఆరెంజ్‌ అలర్ట్‌

- January 02, 2019 , by Maagulf
మనకు ఆరెంజ్‌ అలర్ట్‌

హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఇప్పటికే చలి పులి ధాటికి రెండు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. దీంతో మరో ఐదు రోజుల పాటు ఇదే స్థాయిలో చలి వణికించనుందని మంగళవారం వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల్లో తీవ్రమైన చలి గాలులు వీస్తాయని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో నారింజ రంగు హెచ్చరికలను, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పసుపు రంగు హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది. చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఆరెంజ్‌ కలర్‌ను, చలి తీవ్రత తగ్గితే పసుపు రంగు హెచ్చరికలను వాతావరణ శాఖ నమోదు చేస్తుంది. హైదరాబాద్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ వద్ద రికార్డ్‌ అయిన వాతావరణ ఫలితాల ప్రకారం 6.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది 2010 డిసెంబర్‌ 21వ తేదీన హైదరాబాద్‌లో వాతావరణ విభాగం చేత 8.9 డిగ్రీల సెల్సియస్‌ల అత్యల్ప ఉష్ణోగ్రతగా నమోదయ్యింది. ఐఎండి వాతావరణ హెచ్చరికల్లో రాష్ట్రంలోని 8 జిల్లాలకు నారింజ రంగు హెచ్చరికను జారీ చేసింది. జనవరి 2, 3 తేదీల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిపోవచ్చని అంచనా వేశారు.

దీంతో ఆదిలాబాద్‌, నిర్మల్‌, వరంగల్‌ రూరల్‌, మెదక్‌, పెదపల్లి, కొమరంభీం, మంచిర్యాలలో చలి ఎక్కువ స్తాయిలో ఉండడంతో ఈ జిల్లాల్లో నారింజ రంగు హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. 3 నుండి 5వ తేదీ వరకూ కొన్ని జిల్లాలకు చల్లని గాలులు వీచే క్రమంలో పసుపు హెచ్చరిక జారీ అయ్యాయి. రాష్ట్రంలోని ఆసిఫాబాద్‌, నిర్మల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, కామారెడ్డి, సిద్దిపేట్‌, భూపాలపల్లి, వరంగల్‌ అర్బన్‌, నిజామాబాద్‌, ఖమ్మం, జయశంకర్‌, కొత్తగూడెం జిల్లాల్లో చలి గాలులు తీవ్రంగా వీస్తాయి. ఆదిలాబాద్‌ జిల్లాలోని అర్లీ గ్రామంలో 2.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవ్వగా, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌లలో 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్‌ మధ్య మారుతూ వచ్చాయి. వరంగల్‌, రామగుండంలలో కూడా 9 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా ఉన్నాయి.

ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ, తదుపరి ఐదు రోజులు వర్షపాతం ఉండదని ఐఎండి తెలిపింది. కాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతాయని వివరించింది. ఈనేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com