ఏపీ: త్వరలో ఉచిత వైఫై

- January 02, 2019 , by Maagulf
ఏపీ: త్వరలో ఉచిత వైఫై

ఏపీటీఎల్ ( ఏపీ డిజిటల్ ఇన్ఫ్రా), ఏపీ ఫైబర్ నెట్ కార్యకలాపాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా సచివాలయంలో ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారికి కావాల్సిన ప్రభుత్వ స్థలాలను న్యాయమైన ధరలకు అద్దెకు ఇవ్వాలని ఆయన సూచించారు. ఏపీ డిజిటల్ ఇన్ఫ్రాతో జాయింట్ వెంచర్ తో ఒప్పందం చేసుకున్న కంపెనీకి వచ్చే ఆదాయం నుంచి ప్రతి సంవత్సరం 30.33 శాతం ప్రభుత్వానికి సమకూరుతుందని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, సీఎస్ దృష్టికి తీసుకువచ్చారు. రాబోయే మూడు సంవత్సరాల్లో 5జీ సేవల కోసం 12000 టవర్ల అవసరం ఉంటుందని, ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా, కేవలం స్థలాలను ప్రయివేట్ కంపెనీకి అద్దెకు ఇవ్వడం ద్వారా స్థానిక సంస్థలతోపాటు, పలు శాఖలకు ఆదాయం సమకూరుతుందని ఆయన వివరించారు. ప్రభుత్వ స్థలాలు, భవనాలపై ఏర్పాటు చేసే టవర్లకు ఎంత అద్దె వసూలు చేయాలనే దానిపై, పొరుగు రాష్ట్రాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్ అనిల్ చంద్ర పునేఠా సూచించారు.

రాష్ట్రంలోని 110 మునిసిపాలిటీల్లో 970 ప్రాంతాల్లో ఉచిత వైఫై ఇచ్చే కార్యక్రమం ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 15వ తేదీనాటికి 1000 కేంద్రాలు ప్రారంభించాలని ఏపీ ఫైబర్ నెట్ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం రూ.53 కోట్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్టులో బహుళజాతి సంస్థ గూగుల్ పాలుపంచుకోనుంది. గూగుల్ సంస్థ నెట్ సేవలను ఉచితంగా అందించనుంది. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి 70 శాతం గూగుల్, ప్రభుత్వానికి చెల్లించనుందని అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఇంటర్ నెట్ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. ప్రజా ప్రయోజనాలు కలిగిన ఈ ప్రాజెక్టు ద్వారా ఏప్రిల్ నాటికి 4000 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆ తరవాత గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించనున్నట్టు ఏపీ ఫైబర్ నెట్ అధికారులు వివరించారు. అన్ని శాఖల అధికారులు, వారి కార్యాలయాల్లో వైఫై బాక్సులు పెట్టుకునేందుకు సహకరించాలని సీఎస్, పలు శాఖల కార్యదర్శులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com