జయలలితగా రమ్యకృష్ణ కన్ఫామ్!

జయలలితగా రమ్యకృష్ణ కన్ఫామ్!

తమిళనాడు రాజకీయాల్లో తనదైన మార్క్ చాటుకున్న మహిళానేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలితకు సంబంధించిన బయోపిక్ త్వరలో రాబోతున్న విషయం తెలిసిందే. తెలుగు లో అలనాటి మహానటి సావిత్రి జీవిత కథకు సంబంధించిన మూవీ 'మహానటి'మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'ఎన్టీఆర్'బయోపిక్ రాబోతుంది. ఈ సినిమా రెండు భాగాలుగా ఎన్టీఆర్ కథా నాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు గా రాబోతున్నాయి.

రాజకీయ నేపథ్యంలో వైఎస్సార్ జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర సినిమా రాబోతుంది. ఇక తమిళ నాట అమ్మగా పిలిచే జయలలిత బయోపిక్ తీయబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత తమిళ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. అక్కడి ప్రజల్లో ఆమెకు విశేషమైన ఆదరణ వుంది. అలాంటి జయలలిత బయోపిక్ ను తెరపైకి తీసుకురావడానికి కొంతమంది దర్శక నిర్మాతలు చకచకా సన్నాహాలు చేసేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత జీవితచరిత్రను వెబ్ సిరీస్ గా తీసుకురావడం కోసం దర్శకుడు గౌతమ్ మీనన్ రంగంలోకి దిగారు.

అయితే జయలలిత జీవిత చరిత్రను రెండున్నర గంటల్లో చెప్పడం సాధ్యం కాదని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 32 ఎపిసోడ్స్ గా ఆయన ఈ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేశారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలుకానుంది. గతంలో జయలలిత పాత్రను పోషించడానికి రమ్యకృష్ణ ఆసక్తిని వ్యక్తం చేసింది. బాహుబలి సినిమాలో శివగామిగా రమ్యకృష్ణకు ఎంతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు జయలలిత బయోపిక్ లో చాన్స్ రావడం తన అదృష్టంగా భావిస్తున్న అంటుంది రమ్యకృష్ణ. 

Back to Top