జర్మనీలో భారీ డేటా లీక్!..రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు

- January 05, 2019 , by Maagulf
జర్మనీలో భారీ డేటా లీక్!..రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు

జర్మనీపై భారీ హ్యాకింగ్ దాడి జరిగింది. చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సహా పలువురు జర్మన్ ప్రభుత్వాధికారులే లక్ష్యంగా కొందరు అగంతకులు డేటా లీక్ చేశారు. వందలాది జర్మన్ రాజకీయనేతలు, చాన్సలర్ మెర్కెల్ కి చెందిన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించిన దుండగులు ఆన్ లైన్ పెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆన్ లైన్ లో పెట్టిన సమాచారంలో నివాసాల చిరునామాలు, మొబైల్ ఫోన్ నెంబర్లు, లేఖలు, గుర్తింపు పత్రాల కాపీలు, ఇన్వాయిస్ లు ఉన్నాయి. వీటిని డిసెంబర్ లోనే ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కానీ గత వారమే ఈ డేటా లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది. అయితే హ్యాకర్లు అధికారులను టార్గెట్ చేశారా లేదా వారు అంతర్గత లీక్ బాధితులా అనేది ఇంకా తెలియడం లేదు.

'చాన్సలర్ మెర్కెల్ సహా వందలాది రాజకీయ నేతలు, ప్రముఖుల వ్యక్తిగత సమాచారం, పత్రాలను ఇంటర్నెట్ లో పెట్టారని' ప్రభుత్వ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం గంభీరంగా పరిశీలిస్తోందని తెలిపారు. బాధితులలో పార్లమెంట్ దిగువ సభ.. బుందెస్టాగ్ సభ్యులు, యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు, స్థానిక, ప్రాంతీయ అసెంబ్లీల సభ్యులు కూడా ఉన్నట్టు చెప్పారు. బుందెస్టాగ్ అధ్యక్షుడు ఫ్రాంక్-వాల్టర్ స్టీన్మీర్ సహా సభలో అన్ని పార్టీల నాయకుల డేటా లీకైంది. మెర్కెల్ కార్యాలయం నుంచి ఎలాంటి సున్నితమైన సమాచారం, వివరాలు లీక్ కాలేదని ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలిపారు.

ఈ సంఘటన జర్మనీ రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు పుట్టించింది. దేశ ప్రజాస్వామ్యంపై, సంస్థలపై ఉన్న నమ్మకాన్ని దెబ్బ తీసేందుకే కొందరు ఈ చర్యకు పాల్పడ్డారని న్యాయశాఖ మంత్రి కెటరీనా బార్లే అన్నారు. రాజకీయ నేతలతో పాటు పలువురు సెలబ్రిటీలు, జర్నలిస్టుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఈ లీక్ బట్టబయలు చేసింది. ఎప్పుడు ఈ డేటా చౌర్యం ప్రారంభమైందో తెలియదు కానీ అక్టోబర్ చివరి వరకు కొనసాగిందని బిల్డ్ వార్తాపత్రిక పేర్కొంది. రాజకీయంగా సున్నితమైన అంశాలేవీ దొంగిలించనట్టు తోస్తున్నప్పటికీ పబ్లిష్ చేసిన వ్యక్తిగత డేటా పరిమాణాన్ని చూస్తుంటే ఇదేదో భారీ దెబ్బ తీయనున్నట్టు కనిపిస్తోందని ఆర్బీబీ అనుమానం వ్యక్తం చేసింది. పలు మార్గాలలో ఈ డేటా చౌర్యం జరిగినట్టు తెలిపింది.

ఈ సైబర్ దాడి గురించి పార్లమెంటరీ గ్రూప్ నేతలకు గురువారం అర్థరాత్రి తెలియజేశారు. ఫెడరల్ ఆఫీస్ ఫర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, దేశీయ నిఘా సంస్థలు దర్యాప్తును ప్రారంభించాయి. ప్రస్తుతం తమ దగ్గరున్న సమాచారం మేరకు ప్రభుత్వ నెట్ వర్క్ లను టార్గెట్ చేయలేదని చెప్పాయి. @_0rbit ట్విట్టర్ ఖాతా నుంచి గత నెలలో ప్రతి రోజు లింకులు పబ్లిష్ అయ్యాయి. G0dగా చెప్పుకొనే ఈ ఖాతా 2017 మధ్య ప్రారంభమైంది. దీనికి 18,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. సెక్యూరిటీ పరిశోధన, కళాకారుడు, వ్యంగ్యం-వెటకారం తన చర్యలుగా పేర్కొన్న ఈ ఖాతాదారు తను హ్యాంబర్గ్ లో ఉంటున్నట్టు తెలిపాడు. మెర్కెల్ డేటా లింక్ లో చాన్సలర్ ఉపయోగించే రెండు ఈమెయిల్ అడ్రస్ లు, ఫ్యాక్స్ నెంబర్, ఆమె లేఖలు ఉన్నాయి. శుక్రవారం మధ్యాహ్నానికి ట్విట్టర్ ఈ ఖాతాను రద్దు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com