నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

- January 18, 2019 , by Maagulf
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

అమరావతి:ఎన్నికలు ముంచుకొస్తుండంతో చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేసే విధానానికి స్వస్థి పలుకుతూ.. ఇప్పటి నుంచే కొత్త పథకాల్ని అమలు చేయాలని భావిస్తున్నారు. అన్నివర్గాలకు మేలు చేసే ఉద్దేశంతో వరుసగా కీలక ప్రకటనలు చేయబోతున్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల అభిమానం గెలుచుకుంటూనే.. ముఖ్యంగా విపక్షాలకు చెక్ పెట్టేలా ఈసారి వ్యూహం మార్చి ముందుకెళ్తున్నారు.

ఇప్పటికే అన్ని వర్గాలకు పెన్షన్లు రెట్టింపు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు రైతులకు సాగు సాయంపై కసరత్తు చేస్తున్నారు. సోమవారం జరిగే కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. గత ఎన్నికల హామీ అమల్లో భాగంగా రుణమాఫీ చేసిన చంద్రబాబు.. ఈసారి సాగుకు సాయం చేయనన్నారు. వచ్చే ఖరీఫ్‌ నుంచే అన్నదాతలకు ఈ ఆర్థికసాయం అందించనున్నారు. ఇందుకు సంబంధించిన లెక్కల తయారీలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. కౌలు రైతులనూ గుర్తించేలా వివరాల సేకరణ జరుగుతోంది. రాష్ట్రంలో సాగుభూమి కోటి 60 లక్షల ఎకరాలు ఉంటుందని అంచనా వేస్తున్నందున.. ప్రభుత్వం ఇచ్చే సాయం ఎకరా చొప్పున ఇవ్వాలా లేక ప్రతి రైతుకి ఇంత అని ఇవ్వాలా దానిపై కసరత్తు చేస్తున్నారు.

భూయజమానికి, కౌలురైతులిద్దరికీ న్యాయం చేసేలా పంటసాయం పథకానికి రూపకల్పన చేస్తున్నారు. అటు, ఇప్పటికే వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. మరోవైపు నిరుద్యోగభృతి పెంపుపైనా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం నిరుద్యోగ భృతి వెయ్యి ఇస్తున్నారు. దీన్ని కూడా పెంచే ఆలోచనలో ఉన్నారు. డ్వాక్రా గ్రూప్‌లకు పెద్ద మొత్తంలో నగదు ప్రోత్సాహకాలకు ప్లాన్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com