కుంభమేళాతో 1.2లక్షల కోట్ల ఆదాయం

- January 21, 2019 , by Maagulf
కుంభమేళాతో 1.2లక్షల కోట్ల ఆదాయం

వారణాసి:కుంభమేళా కాసుల వర్షం కురిపించనుంది. అంతేకాకుండా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించనుంది. జనవరి 15న ప్రారంభమై మార్చి4వరకు జరిగే ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళా ద్వారా యూపీ ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుందని ప్రముఖ పరిశ్రమల సమాఖ్య(CII) అంచనా వేసివంది. ఈ చారిత్రక ఆథ్యాత్మిక మేళా ద్వారా రూ.1.2లక్షల కోట్ల ఆదాయం యూపీ ప్రభుత్వానికి రానుందని సీఐఐ అంచనా వేసింది. అంతేకాక వివిధ రంగాలకు చెందిన ఆరు లక్షలమందికి పైగా ఈ ఉత్సవాల ద్వారా ఉపాధి లభించనుందని తెలిపింది.

కుంభమేళాకు సింగపూర్, మలేషియా, నేపాల్, న్యూజిలాండ్, మారిషస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, కెనడా, యూకే జింబాబ్వే వంటి దేశాల నుంచి పెద్ద సంఖ్యలో విదేశీ టూరిస్టులకు తరలివస్తున్నారు. సీఐఐ అంచనా ప్రకారం.. కుంభమేళాకు విదేశీ టూరిస్టుల రాకతో ఆతిథ్య రంగంలో కొత్తగా 2లక్షల50 వేలు, ఎయిర్ లైన్స్, ఎయిర్ పోర్ట్స్ లో దాదాపు 1లక్షా 50వేలు, ఎకో టూరిజమ్, మెడికల్ టూరిజమ్ ద్వారా 85వేలు, టూర్ ఆపరేటర్లుగా 45వేల మందికి ఉపాధి లభించనుంది. వీరితో పాటు టూర్ గైడ్స్, ట్యాక్సీ డ్రైవర్లు, వాలంటీర్లు వంటి అసంఘటిత ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వస్తాయని తెలిపింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కుంభమేళాను యూపీ ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజేష్ అగర్వాల్ తెలిపారు.

మార్చి 4న మహాశివరాత్రిరోజు కుంభమేళాకు దాదాపు 12 కోట్ల మంది హాజరై ప్రయాగ్ రాజ్ పవిత్రనదీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు భావిస్తున్నారు. 2013లో జరిగిన మహా కుంభమేళాకు యూపీ ప్రభుత్వం కేటాయించింది కేవలం 1300 కోట్లు మాత్రమేనని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కుంభమేళాకు యూపీ ప్రభుత్వం 4వేల200 కోట్లు కేటాయించిందని రాజేష్ అగర్వాల్ తెలిపారు. అంటే మహాకుంభమేళాకు కేటాయించిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ నిధులు ఈ కుంభమేళాకు కేటాయించారు. దీంతో ఇప్పటివరకు ఇదే అత్యంత ఖరీదైన కుంభమేళాగా చెప్పవచ్చు. కుంభ మేళా నిర్వహణ ఏరియా కూడా రెండు రెట్లు పెరిగింది. 2013లో యూపీ ప్రభుత్వం 1600 ఎకారాల్లో మహాకుంభమేళాను నిర్వహిస్తే ఈ ఏడాది కుంభమేళాను 3వేల 200 ఎకరాల్లో నిర్వహిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com