‘పద్మశ్రీ’కి వన్నెతెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి..
- January 26, 2019
అన్యాయాలను చూసీ చూడనట్టుగా వెళుతోన్న సిగ్గులేని సమాజాన్ని నిగ్గదీసి అడిగిన కలం అది. నీ ప్రశ్నలు నువ్వే.. ఎవ్వరూ బదులివ్వరు అంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిన కలమూ అదే. బోడి చదువులు వేస్ట్ ఆడి చూడు క్రికెట్టూ అంటూ అభిరుచికి తగ్గట్టుగానే ఎదగాలని ప్రబోధించినా..? ఓటమిని ఒప్పుకోకు, ఓరిమిని వదులుకోకు అంటూనే.. చిలిపి వలపు గీతాలెన్నో రాసినా.. ద్వందార్థాలను తలపుకు రానివ్వనివాడు.. ఇలా.. ఎన్నో సాహితీ సౌరభాలను తెలుగుతెరపై గుభాళిస్తూ.. తన కలమున పాటల ఏరువాక సాగిస్తోన్న సాహితీ సేద్యగాడు సీతారామశాస్త్రికి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ఆయన రాసిన కొన్ని ఉత్తమ గీతాల్ని ఓసారి స్మరించుకుందాం..
పద్మశ్రీకి తెలుగు సిరివెన్నెల వచ్చిన సందర్భం ఇది. తెలుగు సినిమా పాటకు సంబంధించిన సాహిత్యంలో సీతారామరాశాస్త్రిది ప్రత్యేకమైన ముద్ర. తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న సాహితీ స్రష్ట ఆయన. తన కలంతో తెలుగు తెరపై వచన కవిత్వపు సిరివెన్నెలలు కురిపిస్తూ.. ప్రభోదాత్మక, సందేశాత్మక, ఆత్మికమైన మాటల్ని అలవోకగా పాటల్లో బంధించి.. సాహితీ సిరివెన్నెలలు మనకందిస్తోన్న అక్షర ఱేడు మన సీతారామశాస్త్రి . సిరివెన్నెల.. ఈ మాట అంతకు ముందు ఎవరెన్ని సార్లు ఉచ్ఛరించారో తెలియదు కానీ.. ఈ సినిమా వచ్చిన తర్వాత సినిమా కంటే ఎక్కువగా తలుస్తున్నారు.. కారణం సీతారామశాస్త్రి.
తెలుగు సినిమా సాహిత్యాన్ని మరో మెట్టు పైకెక్కించిన కవిత్వంతో ఆబాలగోపాలాన్ని అలరించిన ఆయన కలం ఆది భిక్షువు వాడిని ఏమీ అడగలేం అంటూనే ఆయన గొప్పదనాన్ని కీర్తించిన విధానానికి వివశులం కాకుండా ఉంటామా.. గురు సాక్షాత్ పరబ్రహ్మ .. ఈ మాటను ఎందరు పాటిస్తారో కానీ.. ఆ మాటను పాటీకరిస్తూ సిరి..వెన్నెల రవళించిన అందెలు మాత్రం అవార్డ్ ను అందుకున్నాయి. మంగళ ప్రదాయమైన ఆ అక్షరాలు అవార్డ్ కోసం ఊపిరి పోసుకోలేదు. కానీ.. ఆ పాటను మాత్రం అంబరమంటిన హృదయంతోనే ఆయన రాశారని విన్నవారెవరికైనా అర్థమౌతుంది. తెలుగు పద కవితా పితామహుడిగా అన్నమయ్యను చెబుతాం.. ఆయన పదాల్లోని దైవత్వపు లాలిత్యం అలాంటిది. ఆ లాలిత్యాన్ని అలవోకగా వెండితెరపై ఆవిష్కరించి..
విన్నవారికి ఇది అన్నమయ్యే రాశాడా అనిపించారు.. శ్రుతిలయలు చిత్రంలో. తెలవారదేమో స్వామీ .. నీ తలపుల మునకలో .. అంటూ సాగే ఈ పాట సీతారామశాస్త్రి స్థాయిని మరో మెట్టు పైకి తీసుకువెళ్లింది. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేళ్లైనా.. ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెబుతున్నాం.. అందుకు కారణం.. అంతులేని అవినీతి.. రౌడీయిజం..మరి అవినీతి పరులైన రౌడీలు రాజ్యాలనేలితే.. అది సురాజ్యం ఎలా అవుతుంది.. అలాంటి స్వరాజ్యం మనకెందుకు అంటూ సీతారామశాస్త్రి ప్రశ్నిస్తే… నిజమే కదా అనుకోకుండా ఉండలేం.. ప్రశ్నలోనే ప్రపంచ పరిణామం ఆధారపడి ఉంది. అది మర్చిపోయి ఏం జరిగినా చూసీ చూడనట్టు వెళ్లిపోతున్న జనాల్ని గురించి మనం ఎందుకు ఆలోచించాలి అంటూ గాయం సినిమాలో ఘాటుగా సంధించిన ప్రశ్నలు ఎప్పటికీ ఆలోచనలు రేకెత్తించేవే.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్నిఅంటూ ఆయన కలం ఝళిపిస్తే.. ఆ శబ్ధానికి ఆడియన్స్ ఉలిక్కిపడ్డారు.
ప్రేమలో పడ్డవారికి లోకం సరికొత్తగా కనిపిస్తుంది. అప్పటి వరకూ నమ్మని దేవుడు, స్వర్గం కూడా ఆ క్షణం నుంచి అనుక్షణం కనిపిస్తాయి. అదే ప్రేమ గొప్పదనం. ఆ గొప్పదనాన్నే తన అక్షర ధనంతో ప్రేమకథగా ఆవిష్కరించారు సీతారామశాస్త్రి.. దేవుడు కరుణిస్తాడని.. వరములు కురిపిస్తాడని.. ప్రేమలో పడేవరకూ తెలియలేదంటూ.. సాగే ఈ పాటకు నంది.. వందనం చేయక తప్పింది కాదు.. భార్యాభర్తల మధ్య అనుబంధం నమ్మకం పై సాగాలి.. అది ఆర్థిక సంబంధమైతే.. వారిని కలిపిన ముహూర్తం శుభలగ్నం అనిపించుకోదు. అలా తమ మధ్య ఉన్న బంధాన్ని ఆర్థిక కోణంలో చూసిన ఇల్లాలిని మంగళ సూత్రం అంగడి సరుకా.. కొనగలవా చేజారాక.. అంటూ.. ఒక్కసారి ఆ మంగళ సూత్రాన్ని కోల్పోతే.. ఆ జీవితం ఎడారిలో ఒంటరి నడకవుతుందని హెచ్చరిస్తాడు.
ఇక సీతారామశాస్త్రి పేరు చెప్పగానే వినిపించే మరో పాట సిందూరం చిత్రంలోనిది. అర్థశతాబ్ధపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా అంటూ ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ దొరకదు.. బహుశా ఎప్పటికీ దొరకదేమో.. కలాన్ని ఆయుధంగా మార్చుకుని సామాజిక సమస్యలపై అక్షరాల బుల్లెట్లను సంధించడం అంటే సీతారామశాస్త్రి తప్ప వేరెవరికీ సాధ్యం కాదేమో అనిపిస్తుంది..
ఒంటరి తనాన్ని తుంటరి తనంగా చూడాలంటే అందుకు ఓ జీవితానుభవం కావాలి.. ఆ అనుభవం అతి తక్కువ సమయంలో సాధించాడు కాబట్టే జగమంత కుటుంబం ఉన్నా.. ఏకాకి జీవితం నాది అంటూ.. తనలోకి తనే చూసుకుంటూ.. తనేంటో..తనకేం కావాలో ప్రతి మనిషీ తెలుసుకోవాలంటూ ఓ జీవిత సత్యాన్నే ఆవిష్కరించాడు.. గమనమే నీ గమ్యమైతే బాటలోనే బదులు దొరుకుతుంది.. ప్రశ్నలోనే బదులు ఉంది.. గుర్తుపట్టే గుండెనడుగు.. ప్రపంచం నీలోనే ఉందంటూ గమ్యం సినిమాలో జీవితం అంటే
మనమే అని జీవన వేదాన్ని ఆవిష్కరిస్తాడు. ఇలాంటి మాటల్ని పాటలుగా మలచడం ఒక్క సీతారామశాస్త్రికే చెల్లింది. నీ ప్రశ్నలు నువ్వే ఎవ్వరూ బదులివ్వరుగా అంటూ కొత్త బంగారులోకం సినిమాలో చెప్పిన విధానంలో ఎంత జీవిత సత్యముందని.. వచన కవిత్వాన్ని పాటలోకి మలచడం.. ఆ
మలచే విధానంలోనే ఓ జీవన వేదాన్ని రంగరించడం.. ఆ రంగరింపులోనే కమర్షియల్ కేటగిరీ పోకుండా చూడ్డం.. సీతారామశాస్త్రికి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదు. మొత్తంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే మనకాలపు సినీతత్వవేత్త.. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో దిగజారుడు సాహిత్యాన్ని కురిపిస్తోన్న వెండితెరపై నిజమైన సాహిత్యపు సిరివెన్నెలలను అందిస్తూ కమర్షియల్ కంచెలను దాటుకుని ఆయన కలం సాగిస్తున్న జర్నీ ప్రతి సినిమాకో గమ్యాన్ని చేరుతూ ఇలాగే సాగిపోవాలని కోరుకుంటూ ఆయన అక్షరాలకు పద్మశ్రీ వచ్చిన సందర్భంలో మరోసారి అభినందనలు తెలియజేస్తూ.. ఆయన నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో ఉంటూ.. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని.. మనస్ఫూర్తిగా కోరుకుంటోంది మాగల్ఫ్.కామ్..
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!