హైదరాబాద్‌ని గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్‌ కసరత్తు

- February 09, 2019 , by Maagulf
హైదరాబాద్‌ని గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్‌ కసరత్తు

హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కసరత్తు చేపట్టారు. ఇందుకు అనుగుణంగా బృహుత్తర ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన నగరంలో సమస్యలను ముందుగానే అంచనా వేసి వాటిని పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో భవిష్యత్తు అవసరాలకు తగినట్టు హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ లో రాష్ట్ర మంత్రివర్గం మినహా మరెవరూ మార్పులు చేయకుండా చట్టం రూపొందిస్తామని తెలిపారు కేసీఆర్‌..

నగరాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు కేసీఆర్. ఢిల్లీ కాలుష్య వలయంలో చిక్కుకుంది. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. చైనా రాజధాని బీజింగ్ లాంటి నగరాలు కూడా జనజీవనానికి ఇప్పుడు అనువుగా లేవని అభిప్రాయపడ్డారు. మన కళ్లముందే నగరాలు ఆగమైపోతున్నాయని అన్నారు. ఈ క్షణానికి హైదరాబాద్ పరిస్థితి బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇప్పటికిప్పుడు మేల్కొని సరైన విధంగా సన్నద్ధం కాకుంటే ఈ నగరం పరిస్థితి కూడా విషమిస్తుందని సమీక్ష సమావేశంలో కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

మనిషి జీవితమే ప్రశ్నార్థకంగా మారుతోంది… కాబట్టి ప్రజలు సౌకర్యంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి, అమలు చేయాల్సిన తక్షణ అవసరం ఉందన్నారు సీఎం. హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధి ప్రణాళికను అమలు చేసే బాధ్యతను కేవలం హెచ్ఎండిఏపై మాత్రమే పెట్టకుండా, ఆయా రంగాలకు చెందిన నిష్ణాతులతో కూడిన వివిధ ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేస్తామని తెలిపారు కేసీఆర్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com