ఎం.ఎస్ ధోనీ చుట్టూ పరిభ్రమిస్తున్న వరల్డ్ కప్ 2019
- February 16, 2019
వన్డే ప్రపంచ కప్ 2019లో భారతజట్టు విజేతగా నిలిచి, ముచ్చటగా మూడోసారి కప్పుకొట్టాలంటే జట్టులో ఏ ఆటగాడు కీలకపాత్ర వహిస్తాడనుకొంటున్నారు? ఏ క్రికెటర్ చెలరేగాలని మీరు భావిస్తున్నారు? కెప్టెన్ విరాట్ కోహ్లీనా? లేక వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ? ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా? స్ట్రైక్ బౌలర్ బుమ్రాలలో ఒకరా? ఊహూ…వీరెవరూ కాదండోయ్….మరింకెవరా స్టార్ ఆటగాడు అనే కదా మీ సందేహం! వెటరన్ క్రికెటర్లు, క్రికెట్ మేధావుల అంచనాల ప్రకారం ఆ సూపర్ ప్లేయర్ మరెవరో కాదు… మహీ! అవును….. అక్షరాలా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీయే!నిన్నటి తరం మేటి క్రికెటర్లు సునీల్ గవాస్కర్, మహ్మద్ అజారుద్దీన్,శ్రీలంక వెటరన్ కుమార సంగక్కర, భారత కోచ్ రవిశాస్త్రి, ఛీఫ్ సెలక్టర్ ఎం.ఎస్కే. ప్రసాద్, కెప్టెన్ కోహ్లీ, డిప్యూటీ రోహిత్ శర్మ తదితరుల అంచనాల ప్రకారం భారత జట్టు వరల్డ్ కప్ వ్యూహాలన్నీ ధోనీ చుట్టూనే చక్కర్లు కొడుతున్నాయి.
గత 15 ఏళ్లుగా భారత జట్టుపై చెరగని ముద్ర వేసిన ధోనీ ఈసారి ప్రపంచ కప్ లో రాణించడం జట్టు విజయానికి చాలా కీలకమని వారు భావిస్తున్నారు. గత ఏడాది వన్డేలలో ఫాం కోల్పోయిన ధోనీ, ఒకదశలో జట్టుకే భారంగా మారాడని కొందరు వ్యాఖ్యాతలు బహిరంగంగానే విమర్శించారు. మరికొందరు క్రికెట్ మేథావులు సైతం ధోనీ ఆటకు స్వస్థి పలికి, యువ కీపర్ రిషబ్ పంత్ కు దారి ఇవ్వాలని ఉచిత సలహాలు ఇచ్చారు. 2018లో 20 వన్డేలు ఆడి, కేవలం 25 పరుగుల సగటుతో 275 పరుగులే సాధించిన ధోనీ ఇంకెంత మాత్రం క్రికెట్ లో కొనసాగడం మంచిది కాదని వారంతా హితవు పలికారు. స్వయం ప్రకటిత మేథావులు, కొందరు ఫ్యాన్స్ విమర్శల హోరు ఎలా వున్నప్పటికీ కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఇతర ఆటగాళ్లు మహీని పూర్తిగా వెనకేసుకొచ్చారు. మరికొన్ని మ్యాచ్ లు ఆడితే ధోనీ ఆట గాడిలో పడుతుందని వారంతా వెన్నుదన్నుగా నిలిచారు. అశించినట్టే 2019 సీజన్ మహేంద్ర సింగ్ ధోనీకి బాగా కలిసి వచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో ధోనీ వన్డే గేమ్ గాడిలో పడింది. ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ అర్ధ సెంచరీలతో ఏడు దశాబ్దాలుగా ఊరిస్తున్న వన్డే ద్వైపాక్షిక సిరీస్ విజయాన్ని భారత్ కు అందించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచి, తనలో మ్యాజికల్ ఫినిషర్ ఇంకా మిగిలే వున్నాడని చాటి చెప్పాడు. న్యూజిలాండ్ లోనూ ప్రప్రధమ వన్డే సిరీస్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అటు బ్యాట్స్ మ్యాన్ గా, ఇటు వికెట్ కీపర్ గా, జట్టుకు మైదానంలో సలహాదారుగా బహుముఖ పాత్రలు పోషించి, టీమిండియా విజయాలలో కీలక భూమిక వహించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో వున్న ప్రతిసారీ కెప్టెన్ కోహ్లీ కాని, తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ కాని ఆశ్రయించేది ధోనీనే. అటు వికెట్లు పడగొట్టాలన్నా, ఇటు పరుగులు కట్టడి చేయాలన్నా …..ప్రతి బౌలర్ ఎదురు చూసేది ధోనీ సలహాలు, సూచనల కోసమే.
ఛీఫ్ సెలక్టర్ ఎం.ఎస్కే ప్రసాద్ అంచనాల ప్రకారం వరల్డ్ కప్ టీంలో ధోనీ అత్యంత కీలకమైన వ్యక్తి. మిడిలార్డర్ ప్లేయర్ గా, గేమ్ ఫినిషర్ గా, కోహ్లీకి మెంటార్ గా, యువ ఆటగాళ్లు ముఖ్యంగా స్పిన్నర్లకు గైడ్ గా, అన్నింటికీ మించి వికెట్ల వెనుక గోడలా నిలిచి…ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ క్రీజ్ వదిలి ముందుకొచ్చి – బ్యాట్ ఝళిపించకుండా బౌలర్లకు కాపుకాచే వికెట్ కీపర్ గా బహుముఖ పాత్రలు పోషించే ధోనీ విలువ వెలకట్టలేనిదని ఛీఫ్ సెలక్టర్ అభివర్ణించాడు. మూడు ఐసిసి ట్రోఫీలను భారత్ కు అందించిన ధోనీ అపార అనుభవం కెప్టెన్ కోహ్లీకి, భారత జట్టుకు వరమని శ్రీలంక వెటరన్ కుమార సంగక్కర తేల్చి చెప్పాడు. ఇక టీమిండియా కప్ కొట్టాలంటే ధోనీ తన అపార అనుభవాన్ని, ప్రతిభాపాటవాలను మరోసారి ప్రదర్శించాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇక భారతజట్టు కోచ్ రవిశాస్త్రి అయితే ధోనీ లాంటి క్రికెటర్ అరుదుగా దొరుకుతాడని, ఏ 30,40 ఏళ్లకో ఒకరు ఉద్భవిస్తాడంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఆమాటకొస్తే ధోనికి అసలు ప్రత్యామ్నాయమే లేదని తేల్చి చెప్పడం విశేషం. మళ్లీ మాట్లాడితే పదేళ్లపాటు కెప్టెన్ గా వ్యవహరించిన ధోనీ మానస పుత్రికే ప్రస్తుత భారతజట్టు…గ్రౌండ్ లో, డ్రస్సింగ్ రూములో ధోనీకి లభించే గౌరవం అతని స్థాయిని చెబుతుందని, ఎప్పుడు ఎలా ఆడాలో ధోనీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదంటూ మహీ ప్రాధాన్యతను కోచ్ తేటతెల్లం చేశాడు. ఇక కెప్టెన్, వైస్ కెప్టెన్ లదీ అదే మాట. అటు డ్రెస్సింగ్ రూమైనా,ఇటు గ్రౌండ్లో నైనా తమకు ఎళ్లవేళలా ధోనీ మార్గదర్శనం అవసరమని చెప్పారు.
సీనియర్ ప్లేయర్ గా, అన్ని ఫార్మాట్ లలో విజయ వంతమైన కెప్టెన్ గా, ఓపెనింగ్ నుంచి ఏడో నెంబర్ బ్యాట్స్ మన్ గా, అద్భుతమైన వికెట్ కీపర్ గా, ప్రపంచ క్రికెట్లోనే అసమాన ఫినిషర్ గా, అన్ని ఐసీసీ ఫార్మాట్ లలో భారతజట్టును ఛాంపియన్ గా నిలిపిన అపారమైన అనుభవజ్ఞుడిగా, టీమిండియాను మొట్టమొదటి సారి నెంబర్ వన్ టెస్టు జట్టుగా నిలిపిన సారథిగా, పదేళ్ల పాటు కెప్టెన్ గా, ప్రస్తుత భారత జట్టును తీర్చిదిద్దిన మేథావిగా అనన్య సామాన్యం, అనితర సాధ్యమైన అరుదైన ఘనతల కీర్తికిరీటాలను అలవోకగా సొంతం చేసుకున్న మహేంద్రుడిని మించిన మొనగాడు మరెవరున్నారని మహీ సీనియర్లు, సహచరులు, సెలక్షన్ కమిటీ సభ్యులే తీర్మానిస్తుంటే…మనమెవరం కాదనడానికి? ముచ్చటగా మూడోసారి మనకు ప్రపంచ కప్ తెచ్చిపెడితే సగటు భారతీయుడికి అంతకు మించిన ఆనందం మరింకేముంటుంది. అందని ద్రాక్షలా ఊరించిన వరల్డ్ కప్ ను క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ధోనీ కెప్టెన్సీలో ముద్దాడాడు. ఆ సందర్భంలోనే ధోనీ నేతృత్వంలో టెండూల్కర్ కు అత్యంత ఘనమైన వీడ్కోలు లభించింది. ఈసారీ చరిత్ర పునరావృతమై, భారత్ కు కప్పు, టెండూల్కర్ లా మహేంద్ర సింగ్ ధోనీకి వరల్డ్ కప్ వేదికగా, సాక్షిగా కోహ్లీ సేన అపూర్వమైన వీడ్కోలు చెప్పాలని ఆశిద్దాం.అందుకు ధోనీయే తన అద్భుతమైన ఆటతో అండగా నిలవాలని కోరుకుందాం.(ధోనీ వరల్డ్ కప్ మ్యాచ్ లతోనే కెరీర్ కు గుడ్ బై చెబుతాడని వార్తలు షికారు చేస్తున్నందు వల్ల వీడ్కోలు ప్రస్తావన చేయవలసి వచ్చింది)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..