చనిపోయినట్లు నటించి కాల్పులు జరిపిన ఉగ్రవాది

- March 01, 2019 , by Maagulf
చనిపోయినట్లు నటించి కాల్పులు జరిపిన ఉగ్రవాది

చనిపోయినట్లుగా నటించిన ఓ ఉగ్రవాది భద్రతా బలగాలు అతడి దగ్గరకు రాగానే విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటన జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం కుప్వారాలోని హంద్వారాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. సిబ్బంది రావడం గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వాళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు కొంతమంది సిబ్బంది వెళ్లారు.

అదే అదనుగా భావించిన ఉగ్రవాది అప్పటి వరకు చనిపోయినట్లుగా నటించాడు. భద్రతా సిబ్బంది దగ్గరకు రాగానే లేచి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఓ జవానుతో పాటు మరో ఇద్దరు పోలీస్‌ అధికారులు ఉన్నారు. ఈ దాడిలో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఎన్‌కౌంటర్‌ జరిగే ప్రదేశానికి సమీపంలో ఆందోళనకారులు భద్రతా సిబ్బందిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో సిబ్బంది కాల్పులు జరపడంతో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. కుప్వారాలో ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

సరిహద్దు వెంట పాక్‌ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నియంత్రణ రేఖ వెంబడి మెంధార్‌, బాలాకోట్‌, కృష్ణఘాటి సెక్టార్‌లో పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడింది. పాక్‌ బలగాల కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com